సుశాంత్ ఆత్మహత్యకు ఆమెనే కారణమంటున్న సుశాంత్ తండ్రి

By సుభాష్  Published on  28 July 2020 9:35 PM IST
సుశాంత్ ఆత్మహత్యకు ఆమెనే కారణమంటున్న సుశాంత్ తండ్రి

పాట్నా: సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి అతడి గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి కారణమంటూ సుశాంత్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాట్నాలోని రాజీవ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో రియా చక్రవర్తిపై కేసును సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తండ్రి కేకే సింగ్ ఫిర్యాదు చేశారు. కేకే సింగ్ ఫిర్యాదు మేరకు సుశాంత్ సూసైడ్‌కు సహకరించిందని, అలాగే చీటింగ్, కుట్ర ఆరోపణలపై పోలీసులు రియా చక్రవర్తిపై కేసును నమోదు చేశారు.

రియా నా కుమారుడిని మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా వేధించింది అని సుశాంత్ సింగ్ తండ్రి కేకే సింగ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తండ్రి చేసిన ఫిర్యాదు మేరకు పాట్నా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రియాతోపాటు మరో ఐదుగురు సుశాంత్ స్నేహితులపై కేసు నమోదు చేయడం గమనార్హం. ఐపీసీ సెక్షన్ 306, 340, 342, 380, 406, 420 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారని పాట్నా సెంట్రల్ జోన్, ఐఐజీ సంజయ్ సింగ్ ధృవీకరించారు.

సుశాంత్ మరణంపై సంబంధం ఉన్న కారణాలతో పలువురిని విచారించారు ముంబై పోలీసులు. సుశాంత్ మరణంపై సీబీఐ దర్యాప్తు చేయాలని రియానే అమిత్ షాను కోరుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారు. ఇప్పుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తండ్రి ఇలా కేసు పెట్టడం మరో మలుపు తిప్పింది.

సుశాంత్‌ ఆత్మహత్య కేసులో ప్రముఖ దర్శకుడు మహేష్‌భట్‌ను ముంబై పోలీసులు ప్రశ్నించారు. జూలై 27న శాంతాక్రజ్‌ పోలీస్‌ స్టేషన్‌కు హాజరైన మహేష్‌ భట్‌ను కొన్ని గంటలపాటు విచారించిన పోలీసులు ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. మహేష్‌ భట్‌తోపాటు కరణ్‌ జోహార్‌ మేనేజర్‌ను కూడా విచారణకు హాజరు కావాలని మహారాష్ట్ర హోశాఖ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ కోరారు. తను సుశాంత్‌ను కేవలం రెండు సార్లు మాత్రమే కలిసినట్లు మహేష్‌ భట్‌ వెల్లడించారు. నవంబర్‌ 2018లో ఒకసారి, 2019 జనవరిలో కలిశానని మహేష్ భట్ తెలిపారు. సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి నా 2018 చిత్రం 'జలేబీ'లో పనిచేసింది. ఆ సమయంలో కలిసి పనిచేయడం వల్ల రియా నన్ను ఒక మెంటర్‌గా గౌరవించేది. నా చిత్రాల్లో నటించాలని సుశాంత్ నటించాలని ఏ రోజు కోరలేదని తెలిపారు. సుశాంత్‌ తనతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపించాడని.. తన ప్రాజెక్టులలో కనీసం ఒక చిన్న పాత్ర ఇవ్వమని కోరాడని భట్‌ తెలిపారు.

కలీనాలోని ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ (ఎఫ్ఎస్ఎల్) తాజాగా సుశాంత్‌ది ఆత్మహత్యేనని స్పష్టం చేసింది. ఇంతలో సుశాంత్ తండ్రి తన కుమారుడి మరణానికి రియానే కారణమని పోలీసులను ఆశ్రయించడం సంచలనమవుతోంది.

Next Story