రియా చక్రవర్తి తమ్ముడి అరెస్ట్.. నెక్స్ట్ అరెస్టులు వారివేనా..!

By సుభాష్  Published on  5 Sep 2020 2:40 AM GMT
రియా చక్రవర్తి తమ్ముడి అరెస్ట్.. నెక్స్ట్ అరెస్టులు వారివేనా..!

నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వ్యవహారంలో డ్రగ్స్ కోణం కూడా ఉందని తేలిన సంగతి తెలిసిందే..! రియా చక్రవర్తి ఇటీవల మాట్లాడుతూ సుశాంత్ కు గంజాయి కొట్టే అలవాటు ఉందని చెప్పింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్.సి.బి.) ఈ కేసులో ఎంటర్ అయింది. శుక్రవారం నాడు విచారణ జరిపిన అధికారులు రియా చక్రవర్తి తమ్ముడు షోవిక్ చక్రవర్తి ను సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హౌస్ మేనేజర్ శామ్యూల్ మిరందాను అరెస్టు చేశారు. డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసిన షోవిక్ చక్రవర్తి, శ్యామ్యూల్ మిరందాలను శనివారం ఉదయం కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ముగ్గురు డ్రగ్స్ సప్లయిర్లను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టిన అధికారులు.. షోవిక్ చక్రవర్తి, శ్యామ్యూల్ మిరందాలను సెప్టెంబర్ 9వ తేదీ వరకు కస్టడీలో ఉంచుకోనున్నట్టు తెలుస్తోంది.

శుక్రవారం ఉదయం ఎన్.సి.బి. అధికారులు పోలీసులతో కలిసి షోవిక్ చక్రవర్తి(రియా చక్రవర్తి), శామ్యూల్ మిరందా ఇళ్లపై సోదాలు జరిపారు. ఉదయం 6:30 నిమిషాల సమయంలో వారి ఇంటిలోకి అధికారులు ఎంటర్ అయినట్లు తెలుస్తోంది.. కొందరు మహిళా అధికారిణులు కూడా మాస్కులు, గ్లవ్స్ వేసుకుని కనిపించారు. పలు వాహనాలలో వారు అక్కడికి చేరుకున్నారు.

ఎన్‌డీపీఎస్‌ చట్టం, విధివిధానాలను అనుసరించి ఈ మేరకు రియా, మిరండా నివాసాల్లో సోదాలు చేసినట్లు ఎన్‌సీబీ డిప్యూటీ డైరెక్టర్‌ కేపీఎస్‌ మల్హోత్రా వెల్లడించారు.

డ్రగ్స్ సప్లయిదార్లతో సంబంధాలున్నాయనే విషయాన్ని ధృవీకరించుకొన్న ఎన్సీబీ అధికారులు కొద్దిరోజులుగా షోవిక్, రియా, మిరందాలను విచారిస్తున్నారు. డ్రగ్స్ సప్లయిదారులు చెప్పిన విషయాలు, షోవిక్ చెప్పిన విషయాల మధ్య పొంతన కుదరకపోవడంతో మిరందాతో కలిపి శుక్రవారం మళ్లీ విచారణకు పిలిచారు. శుక్రవారం విచారణ ముగియగానే వారిని అరెస్టు చేస్తున్నట్లు తెలిపారు.

సుశాంత్ ఆత్మహత్య కేసును సీబీఐ, ఈడీ, నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు వేర్వేరుగా దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. సుశాంత్, అతడి సన్నిహితుల ప్రైవేట్ వాట్సప్ గ్రూప్‌లోని మెసేజ్‌ల ఆధారంగా డ్రగ్స్ వ్యవహారంపై కీలక వివరాలు బయటకు వచ్చాయి. రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్, గౌరవ్ ఆర్యా, జయ సాహా, సుశాంత్ కో మేనేజర్ శ్రుతి మోడీలపై నార్కొటిక్ అధికారులు కేసులు పెట్టారు. డ్రగ్ డీలర్లు అబ్దుల్ బాసిత్, కైజాన్ ఇబ్రహీంలు అరెస్ట్ కాగా.. విచారణలో రియా చక్రవర్తి, శామ్యూల్ మిరందా పేర్లు బయటకు వచ్చాయి. షోవిక్, మిరందాలు విచారణలో ఎవరి పేర్లు బయట పెడతారో.. ఇంకెన్ని అరెస్టులు జరుగుతాయో చూడాలి.

Next Story