సూర్యాపేటలో దారుణం: ఇద్దరు పిల్లలను చెరువులోకి తోసేసిన తల్లి
By సుభాష్
తెలంగాణలోని సూర్యాపేటలో దారుణం చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలు పిల్లల ప్రాణాల మీదకు తెచ్చింది. సూర్యాపేటలోని విద్యానగర్‌లో నివాసం ఉంటున్న ప్రశాంత్‌కుమార్, నాగమణి భార్యాభర్తలిద్దరూ ఆదివారం రాత్రి గొడవపడ్డారు. దీంతో ఇద్దరు పిల్లలను తీసుకొని బయటకు వెళ్లిన భార్యనాగమణి సమీపంలోని సద్దల చెరువులో కొడుకు హర్షవర్ధన్, కుమార్తె జ్యోతిమాధవిని పడేసింది. సోమవారం ఉదయం చెరువు వద్ద నాగమణి ఉండడాన్ని గమనించిన స్థానికులు.. ఏమైందోనని ఆరా తీశారు.
ఇద్దరు పిల్లలను చెరువులో తోసేసినట్లు చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చెరువులో కుమారుడు హర్షవర్ధన్ మృతదేహాన్ని బయటకు తీయగా, కూతురు జ్యోతిమాధవి కోసం చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. భార్యాభర్తలిద్దరి గొడవల కారణంగా అభం శుభం తెలియని చిన్నారులు బలికావడంపై స్థానికులు కంటతడి పెడుతున్నారు. తల్లిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇంట్లో జరిగిన గొడవలపై ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు విచారణ చేపడుతున్నారు.