26న సూర్యగ్రహణం.. జాగ్రత్తలు ఇవే..!

By సుభాష్  Published on  22 Dec 2019 7:54 AM GMT
26న సూర్యగ్రహణం.. జాగ్రత్తలు ఇవే..!

డిసెంబర్ 26 సూర్యగ్రహణం ఏర్పడనుంది. దీంతో తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. ఈ సూర్యగ్రహణం సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని 13 గంటల పాటు మూసివేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 25 రాత్రి 11 గంటల నుంచి 26 మ.12 గంటల వరకూ ఆలయాన్ని మూసివేయనున్నారు. గ్రహణం సందర్బంగా శ్రీవారి ఆలయంతో పాటు వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రాన్ని కూడా మూసివేయనున్నారు. 26 జరిగే పలు ఆర్జిత సేవలు కూడా రద్దు కానున్నాయి. గ్రహణం అనంతరం ఆలయాన్ని శుద్ధి చేసిన తర్వాత తిరిగి భక్తులకు దర్శనం కల్పించనున్నారు ఆలయ అధికారులు. గ్రహణం సందర్భంగా ఈ ఆలయాలే కాకుండా ఇతర ఆలయాలు కూడా మూసివేయనున్నారు.

ఈ సూర్య గ్రహణం భారతదేశంలో స్పష్టంగా కనిపిస్తుంది. "ధనస్సు" రాశి మూల నక్షత్రం "మకర , కుంభ" లగ్నాలలో కేతు గ్రస్త కంకణ సూర్య గ్రహణం సంభవిస్తోంది. ఈ గ్రహణం భారతదేశంతో పాటు ఆసియా, ఆస్ట్రేలియా ఖండాలలో స్పష్టంగా కనిపించనుంది. ఖగోళంలో ఈ గ్రహణం 3 గంటల 39 సెకండ్లు ఉంటుంది. కర్ణాటక, తమిళనాడు, కేరళలోని కొన్ని ప్రాంతాలలో కంకణోక్త సంపూర్ణ సూర్య గ్రహణం వేర్వేరు సమయాలలో ఉంటుంది. పై మూడు రాష్టాలు మినహాయించి మిగిలిన తెలంగాణ ,ఆంద్రప్రదేశ్ తో పాటు భారతదేశంలోని ఇతర రాష్టాలన్నింటిలో పాక్షిక సూర్యగ్రహణం గోచరిస్తుంది.

హైదరాబాద్ లో ఉదయం 8:08 నిముషాలకు ఈ సూర్యగ్రహణ ప్రారంభమై మధ్యకాలం 9:30 చేరుకుంటుంది. ఉదయం 11 :10 నిమిషాలకు " పుణ్యకాలం " ముగుస్తుంది. గ్రహణ సమయంలో సూర్యుడు అగ్నివలయంలాగా గ్రహణం చుట్టూ కనిపించనున్నాడు. కేరళలోని చెరువుత్తూర్ లో దేశంలో అన్ని ప్రాంతాల్లో కంటే సూర్య గ్రహహణ దృశ్యం స్పష్టంగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచంలో అతికొద్ది ప్రాంతాల్లో మాత్రమే ఇంత స్పష్టంగా సూర్యగ్రహణం కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సూర్యగ్రహణం చూసే సమయంలో రక్షిత కంటి అద్దాలు లేకుండా డైరెక్టుగా సూర్యుడిని చూడవద్దని నేత్ర వైద్యులు హెచ్చరిస్తున్నారు.

సూర్యుడికి , భూమికి మధ్య చంద్రుడు ప్రవేశించడంతో సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ ఏడాది సూర్యగ్రహణం, చంద్రుడు సూర్యుడికి మధ్యలో నుండి అంచులో అగ్నివలయంలాగా కనిపిస్తాడు. భారతదేశంలోనే కాకుండా , సౌదీ అరేబియా, సుమత్రా, బార్నియో లాంటి ప్రాంతాల్లో కూడా సూర్య గ్రహణం దర్శనమిస్తుంది. ఎవరైన గ్రహణాన్ని గ్రహణ సమయంలో ప్రత్యక్షంగా చూడకూడదని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే గ్రహణం సందర్భంగా చాలా మందిలో ఎన్నో అపోహాలు, ఎన్నో భయాందోళనలు తలెత్తుతాయి. గర్భవతులు ఎలాంటి వారు ఎలాంటి భయందోళనలు చెందాల్సిన అవసరం లేదని జోతిష్యులు చెబుతున్నారు. గ్రహణ సమయంలో మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని ధ్యానం, జపం, ఆధ్యాత్మిక చింతనతో ఉంటే చాలా మంచిదని పండితులు సూచిస్తున్నారు. గ్రహణం అనంతరం ఇంట్లో శుద్ది చేసుకుని దీపారాధన చేసుకుంటే మరి మంచిదన జ్యోతిష్యులు సూచిస్తున్నారు. ఈ గ్రహణం వల్ల ఎలాంటి వారైన సరై లేనిపోని అపోహాలు పెట్టుకుని భయాందోళన చెందవద్దని సూచిస్తున్నారు.

Next Story
Share it