చెన్నై సూపర్ కింగ్స్ కు మరో షాక్.. ఐపీఎల్ నుంచి రైనా ఔట్
By తోట వంశీ కుమార్ Published on 29 Aug 2020 12:13 PM ISTఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్ ప్రారంభం కాకముందే చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) జట్టుకు మరో షాక్ తగిలింది. ఆ జట్టు కీలక ఆటగాడు సురేష్ రైనా ఈ ఏడాది సీజన్‌కు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని ఆ జట్టు యాజమాన్యం ట్విట్టర్‌లో ప్రకటించింది. వ్యక్తిగత కారణాలతో సురేష్ రైనా.. దుబాయ్ నుంచి వెనక్కి వచ్చేశారని తెలిపింది. ఈ విషయంలో సురేష్ రైనాకు, అతడి కుటుంబానికి పూర్తి మద్దతు ఇస్తామని సీఎస్‌కే ప్రకటించింది.
ఇటీవలే టీమ్‌తో కలిసి యూఏఈకి వెళ్లిన రైనా.. వెనక్కి ఎందుకొచ్చాడన్నదానిపై సీఎస్‌కే స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. సీఎస్‌కే విజయాల్లో రైనా కీలక పాత్ర పోషించాడు. ఇలాంటి ఆటగాడు సీజన్ మొత్తం దూరమవ్వడం చెన్నైకి పెద్ద మైనస్ కానుంది. ఐపీఎల్‌లో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్లలో రైనా ఒకడు. సీఎస్‌కే తరుపున ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన ఆటగాడు కూడా సురేష్ రైనానే. ఇటీవలే మహేంద్రసింగ్ ధోనితో పాటు ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు.
ఇక ఈ సీజన్‌కు ముందు సీఎస్‌కే కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. నిన్న చెన్నై జట్టులో ఒక పేసర్, 12 మంది సహాయక సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ 13వ సీజన్ ప్రారంభం కానుంది. యూఏఈలోని అబుదాబీ, దుబాయ్, షార్జా స్టేడియాలలో మ్యాచులు జరగనున్నాయి. మొత్తం 54 రోజుల పాటు సాగనుంది. ఫైనల్ మ్యాచ్ నవంబర్ 10న జరగనుంది. ఇప్పటికే ఐపీఎల్‌లో పాల్గొనే అన్ని జట్లు యూఏఈ చేరుకున్నాయి. కొన్ని జట్లు క్వారంటైన్‌ను పూర్తి చేసుకుని ప్రాక్టీస్‌ను మొదలెట్టాయి.