ఢిల్లీ: కశ్మీర్‌లో కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై సుప్రీం కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. జమ్మూకశ్మీర్‌లో పెద్ద ఎత్తున నిర్బంధం విధించడం, పౌరహక్కులపై ఆంక్షలపై కేంద్రాన్ని సుప్రీం కోర్ట్ ప్రశ్నించింది. ఆరోపణలకు సంబంధించి ఎందుకు స్పందించలేదంటూ కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఘాటుగా ప్రశ్నించింది.

ఆర్టికల్ 370 రద్దు తరువాత సుప్రీం కోర్ట్‌లో పెద్ద ఎత్తున పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఆసిఫా ముబీన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై అఫిడవిట్‌ రూపంలో సమాధానం ఎందుకు ఇవ్వలేదంటూ కేంద్రాన్ని, కశ్మీర్‌లో ఉన్న పాలకులను నిలదీసింది. ఎన్నారై అయిన తన భర్తను అదుపులోకి తీసుకున్నారని, ఇది వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనంటూ ఆసిఫా ముబీన్ పిటిషన్ వేసింది.

సుప్రీంకోర్టు ఆగ్రహంతో కశ్మీర్‌ పాలకులు స్పందించారు. ఐదు నిమిషాల్లో అఫిడవిట్‌ దాఖలు చేస్తామని పేర్కొన్నారు. ఎంతోమంది పిటిషన్లు వేశారని, అందువల్లే అఫిడవిట్‌ దాఖలు చేయడంలో జాప్యమైందని సొలిసిటర్‌ జనరల్‌ సుప్రీం కోర్ట్‌కు నివేదించారు. కశ్మీర్‌లో నిర్బంధంపై అఫిడవిట్లు దాఖలు చేయకపోవడాన్ని సుప్రీం కోర్ట్ తీవ్రంగా తప్పుబట్టింది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.