ముఖ్యాంశాలు

  • ఆయా పార్టీల అభ్యర్థుల నేర చరిత్ర బయటపెట్టాలని ఆదేశాలు
  • నేర చరిత్ర ఉన్నా ఎందుకు ఎంపిక చేశారో వివరణ ఇవ్వాలన్న సుప్రీం

రాజకీయ పార్టీలకు సుప్రీంకోర్టు దిమ్మతిరిగే షాకిచ్చింది. ఎన్నికల్లో పోటీ చేసిన, చేస్తున్న అభ్యర్థులకు సంబంధించిన నేర చరిత్రను ఆయా పార్టీల వెబ్ సైట్లలో అప్ లోడ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే నేర చరిత్ర ఉందని తెలిసి కూడా వారిని ఎన్నికల్లో అభ్యర్థులుగా ఎందుకు నిలబెట్టారో కారణాలు కూడా తెలపాలని సుప్రీం తెలిపింది.

2018 సెప్టెంబర్ 25న ఎన్నికల్లో పోటీకి దిగేముందు ఆయా పార్టీల అభ్యర్థులు తమకు చెందిన నేర చరిత్రను బహిర్గతం చేయాలని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగీవ్రంగా స్పష్టం చేసింది. అభ్యర్థుల నేరచరిత్ర ముద్రణ, మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలకు తెలియజేయాలని పేర్కొంది. కానీ..అప్పుడు సుప్రీం చెప్పిన తీర్పును రాజకీయ పార్టీలేవీ పాటించడం లేదని ఆరోపిస్తూ ప్రముఖ సీనియర్ లాయర్ అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేసిన అత్యున్నత న్యాయస్థానం గురువారం తీర్పు వెల్లడించింది. గత నాలుగు సార్వత్రిక ఎన్నికల నుంచి రాజకీయ అభ్యర్థుల్లో దాదాపుగా నేరస్తులే ఉంటున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ఇకపై ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వివరాలను తమ వెబ్ సైట్లలో పొందుపరచాలని స్పష్టం చేసింది. సోషల్ మీడియా, స్థానిక, నేషనల్ వార్తా పత్రికల్లో ద్వారా కూడా ఈ వివరాలను ప్రజలకు తెలియజేయాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే నేర చరిత్ర ఉన్న అభ్యర్థులను ఎన్నికల బరిలో ఎందుకు నిలబెట్టారన్నదానికి ఖచ్చితమైన కారణాలు చెప్పాలని స్పష్టం చేసింది. ఆయా పార్టీల్లో ఉన్న అభ్యర్థుల నేరచరిత్రపై 72 గంటల్లోగా నివేదిక సమర్పించాలని సూచించింది. అలాగే సుప్రీం ఆదేశాలను రాజకీయ పార్టీలు ఉల్లంఘిస్తే..ఆ విషయాన్ని తమ దృష్టికి తీసుకురావాలని సుప్రీం..ఈసీని ఆదేశించింది.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.