నిర్భయ కేసులో దోషులకు విధించిన ఉరిశిక్షను సవాల్ చేస్తూ…దోషుల్లో ఒకడైన అక్షయ్ కుమార్ సింగ్ సుప్రీం కోర్టులో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ ను పరిశీలించిన సుప్రీంకోర్టు..కొట్టివేసింది. ఉరిశిక్ష అమలుపై స్టే విధించాలని కోరుతూ అతడు పెట్టుకున్న పిటిషన్ కూడా కోర్టు తిరస్కరించింది. ‘‘మౌఖిక విచారణ కోసం పెట్టుకున్న పిటిషన్‌ను తిరస్కరిస్తున్నాం. ఉరిశిక్ష అమలుపై స్టే విధించాలన్న పిటిషన్‌ను కూడా కొట్టేయడం జరిగింది. క్యూరేటివ్ పిటిషన్లు, సంబంధిత పత్రాలను మేము పరిశీలించాం. ఆయన వాదనలను బలపరిచే అంశాలేవీ లేనందున క్యూరేటివ్ పిటిషన్లను తిరస్కరిస్తున్నాం..’’ అని జస్టిస్ ఎన్‌వి రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం పేర్కొంది. ఫిబ్రవరి 1వ తేదీన నిర్భయ కేసులోని నలుగురు దోషులకు ఉరిశిక్ష పడనుంది.

ఇప్పటి వరకూ మూడుసార్లు ఉరిశిక్ష వాయిదా పడింది. గతేడాది డిసెంబర్ లోనే నిందితులను ఉరితీయాల్సింది. కానీ ఒక్కో నిందితుడు ఒక్కో కారణంతో ఉరిశిక్ష ఆపాలని, తమకు క్షమాభిక్ష పెట్టాలంటూ పిటిషన్ లు వేస్తుండటంతో కోర్టు ఉరిశిక్ష అమలు తేదీని మార్చుతూ వచ్చింది. కానీ ఈసారి నిందితుల పై ఎత్తులు కోర్టు తీర్పు ముందు పనికిరాలేదు. పవన్ గుప్తా, అక్షయ్ కుమార్ సింగ్ పదే పదే పిటిషన్లు వేసినా, ఆరోపణలు చేసినా…డిల్లీ హై కోర్టు, సుప్రీంకోర్టు వాటన్నింటినీ తోసిపుచ్చాయి. ఎప్పటిలాగానే ఉరిశిక్ష తేదీని మార్చకుండా అలానే ఉంచింది. అంటే.. రేపు కాక ఎల్లుండే నిర్భయ దోషులను తీహార్ జైలులో ఉరితీయనున్నారు జైలు అధికారులు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.