బిగ్‌బ్రేకింగ్: సమత కేసులో దోషులకు ఉరిశిక్ష
By సుభాష్ Published on 30 Jan 2020 1:37 PM IST
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సమత కేసులో ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో ముగ్గురు దోషులైన షేక్ బాబు, షాబుద్దీన్, మగ్దూంలకు ఉరి శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. కాగా, ఈ కేసు తుది తీర్పు ఈనెల 27వెలువరించాల్సి ఉండగా, న్యాయమూర్తికి అనారోగ్యం కారణంగా జనవరి 30కి వాయిదా వేసింది. ఈ రోజు కేసు విచారణ జరిపిన న్యాయస్థానం తుది తీర్పు వెల్లడించింది. కాగా, 2019, నవంబర్ 24న కొమురం భీం జిల్లా లింగాపూర్ మండలం ఎల్లపటార్ శివారులో ముగ్గురు కామాంధులు సమతపై అత్యాచారం చేసి, అపై హత్యకు పాల్పడ్డారు. నవంబర్ 25వ తేదీన ఆమె మృత దేహం లభ్యమైంది.
గ్రామాల్లో బెలూన్లు అమ్ముకుంటూ జీవనం సాగించే బాధితురాలు ఒంటరిగా ఉండటం గమనించిన ముగ్గురు వ్యక్తులు చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి, దారుణంగా చంపేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేసు విచారణ జరుగగా, ఈరోజు దోషులకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది ప్రత్యేక న్యాయస్థానం.