పరీక్షల నిర్వహణపై సుప్రీం కోర్టు కీలక తీర్పు
By తోట వంశీ కుమార్ Published on 28 Aug 2020 6:39 AM GMTదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దీంతో విద్యాసంస్థలు అన్ని మూత పడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో టెన్త్, ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండానే పాస్ చేసి పై తరగతులకు ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఫైనల్ ఇయర్ చదివే విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని యూజీసీ(యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) ఇటీవల మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మార్గదర్శకాలను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్లపై ఈ రోజు విచారణ జరిపింది. జస్టిస్ అశోక్‌భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. సెప్టెంబర్ 30లోపు విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలన్న యూజీసీ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్ధించింది. ఫైనల్ ఇయర్ పరీక్షలు నిర్వహించాల్సిందేనని స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు ఏమైన ఇబ్బందులు ఉంటే.. యూజీసీని సంప్రదించాలని సూచించింది. పరీక్షల గడువు పెంచాలని రాష్ట్రాలు యూజీసీని కోరవచ్చునని స్పష్టం చేసింది.
దీంతో డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు జరగాల్సిందే. అయితే ఎప్పటివరకు అన్నది తర్వాత నిర్ణయించొచ్చు. పరీక్షలు లేకుండా ఇంటర్నల్ మార్కుల ఆధారంగా డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థుల్ని పాస్ చేసే అవకాశం లేదు. రెండు నెలల క్రితం సెప్టెంబర్ 30 లోగా డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షల్ని నిర్వహించాలని విశ్వవిద్యాలయాలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సర్క్యులర్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి కొనసాగుతుండటంతో పరీక్షల్ని నిర్వహించాలని యూజీసీ సర్క్యులర్ జారీ చేయడంపై డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. దీంతో ఈ పరీక్షల్ని రద్దు చేసి ఇంటర్నల్ అసెస్‌మెంట్ ద్వారా మార్కులు వేయాలంటూ విద్యార్థులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.