ఓ మహిళ చేసిన పనికి.. రూ.26లక్షల విలువ చేసే ఆహారాన్ని పడేశారు
By తోట వంశీ కుమార్ Published on 28 March 2020 6:13 AM GMTకరోనా వైరస్(కొవిడ్-19) ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనా వ్యాప్తి కట్టడికి ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ మహమ్మారి రోజు రోజుకు విస్తరిస్తోంది. కాగా చాలా దేశాలు లాక్‌డౌన్ ప్రకటించినా.. ప్రజలు మాత్రం ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండడంతో తలనొప్పిగా మారింది. తాజాగా పెన్సిల్వీనియాలో చోటుచేసుకున్న ఈ ఘటనే ఇందుకు నిదర్శనం.
పెన్సిల్వీనియాలో కరోనా ముప్పుతో లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. అయితే.. కేవలం నిత్యావసర వస్తువులను విక్రయించే షాపులను మాత్రమే తెరిచి ఉంచారు. హాన్వావర్ టౌన్‌షిప్‌లోని గెర్రీటీ సూపర్ మార్కెట్లో వస్తువులు కొనుగోలు చేయడానికి ఓ మహిళ వచ్చింది. ఆమెకు దగ్గు రాకపోయినా కావాలనే దగ్గింది. ప్రాంక్ వీడియో కోసమే అలా చేసానని తరువాత భద్రతా సిబ్బందికి చెప్పింది. దీంతో మార్కెట్ సిబ్బందికి కోపం వచ్చింది. ఆమెను వెంటనే మార్కెట్ నుంచి బయటకు పంపేశారు. ఆమె కావాలనే దగ్గిందని తెలిసినా సూపర్ మార్కెట్ నిర్వాహకులు తమ కస్టమర్లకు ఎలాంటి సమస్య రాకూడదని భావించారు.
ఒక వేళ ఆమె కరోనా బాధితురాలైతే.. ఆమె చేసిన పనికి అక్కడ ఉన్న వస్తువుల ద్వారా కస్టమర్లకు వైరస్ సోకే ప్రమాదం ఉందని బావించి ఆమె తుమ్మిన ప్రదేశంలోని వస్తువులతో పాటు ఆమె తాకిన వస్తువులను పడేయాలని నిర్ణయించింది యాజమాన్యం. వాటి విలువ రూ.26లక్షలు ఉంటుందని తెలిపారు. యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయానికి కస్టమర్లతోపాటు నెటిజనులు కూడా ప్రశంసలు కురిపిస్తు్న్నారు. లాభాల కోసం ఆలోచించకుండా ప్రజల ఆరోగ్యం కోసం మీరు తీసుకున్న నిర్ణయం అద్భుతమని కొనియాడుతున్నారు. ఈ విషయాన్ని సూపర్ మార్కెట్ యజమాని జాయ్ ఫసులా పేస్‌బుక్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం మార్కెట్లో నిత్యవసర వస్తువుల దొరకలేని పరిస్థితి ఉందని, ఇలాంటి సమయంలో ప్రజలు తెలివి తక్కువ పనులు చేసి పరిస్థితులను మరింత దిగజారే పరిస్థితి తెవొద్దని కోరారు.