మష్రూమ్‌ ధర మండుతోంది.!

By మధుసూదనరావు రామదుర్గం  Published on  25 Aug 2020 4:02 PM IST
మష్రూమ్‌ ధర మండుతోంది.!

పుట్టగొడుగులు అంటే మిగిలిన కాయగూరల్లా ఇవీ ఏవో వండుకుని తినేవే అనుకుంటుంటాం. కానీ ఒక్కసారి వీటి ధర చూశాక అయ్యబాబోయ్‌ అనక తప్పదు. పుట్టగొడుగుల్లో బటన్‌ అయిస్టర్‌ వెరైటీలు మనకు ఎక్కువగా లభిస్తాయి. కానీ కొన్ని రకాలు కీకారణ్యాల్లో దొరుకుతాయి. వాటిలో ఔషధగుణాలుండటంతో ధర లక్షల్లో ఉంటుంది.

సూపర్‌ మష్రూమ్‌గా ప్రసిద్ధికెక్కిన కార్డిసెప్స్, మిలిటారిస్‌ రకాలు ఈ కోవ కిందే వస్తాయి. ఇదే రకానికి చెందిన కార్డిసెప్స్‌ సైనెన్సిస్‌ రకాన్ని హిమాలయ వయాగ్రా అంటారట! ఉత్తరాఖండ్‌లో దొరికే ఈ రకం స్థానికంగా అయిలే కేజీ పదిలక్షలయితే.. విదేశీయ మార్కెట్‌లో కనీసం రూ. 20 లక్షలదాకా పలుకుతుందట! బహశా లభ్యత తక్కువ కావడం వల్లో, అరుదైన జాతి కావడం వల్లో ధర ఆకాశం నుంచి చూస్తోందనిపిస్తుంది.

మరి ఇంత లక్షలు పోసి పుట్టగొడుగులు కొని వండుకుని తినకపోతే ప్రాణమేమైనా పోతుందా అని మనకనిపించవచ్చు. వంటలో వాడకుంటే ప్రాణం పోదుగానీ.. ఔషధాల్లో వాడితే మాత్రం పోయే ప్రాణం నిలుస్తుందంటారు నేచురోపతి డాక్టర్లు. అయితే ఈ రకం పుట్టగొడుగుల్లోని ఔషధ గుణాలేంటి అంటే.. వేల ఏండ్ల కిందటే టిబెట్‌లో రోగం వచ్చాక కోలుకునే మందుగా వీటిని వాడేవారట!

అలాగే చైనీయులు తమ వైద్యంలో ఈ రకం పుట్టగొడుగుల్ని వాడుతున్నారు. ఈ మష్రూమ్స్‌లో పోషకాలతోపాటు ఔషధ గుణాలున్నాయని గుర్తించారు. 18 రకాల అమ్లాలతోపాటు విటమిన్‌–ఇ, కె, బి1, బి2, బి12, పుష్కలంగా లభిస్తాయి. వీటితో తయారు చేసే కార్డిసెపిన్‌ ఔషధానికి బ్యాక్టీరియా, వైరస్, క్యాన్సర్‌ తదితర వ్యాధుల్ని ఎదుర్కొనే శక్తి ఉంది. ఫంగస్, మలేరియా, డయాబెటిస్‌ రుగ్మతలను నయం చేసే గొప్ప శక్తి ఈ ఔషధానికుంది. అంతేకాదు కాలేయం, శ్వాసకోసం, నాడీవ్యవస్థ, మూత్రపిండాల పనితీరు మెరుగవడానికి ఈ ఔషధం దివ్యంగా పనిచేస్తుంది.

పరిశోధకులు ఈ రకం పుట్టగొడుగుల్ని కృత్రిమంగా పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. అసోం బోడోల్యాండ్‌కి విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్‌ సందీప్‌ దాస్‌ వీటిని కృత్రిమంగా పెంచడానికి చేసిన కృషి ఫలించింది, అత్యంత అరుదుగా లభించే ఈ మష్రూమ్‌లో అద్భుత ఔషధ గుణాలున్నాయని చెబతున్నారు. క్యాన్సర్,శ్వాసకోస ఇబ్బందితో బాధపడుతున్నా, రోగనిరోధక శక్తి తగ్గిపోతున్నా, విటమిన్‌ బి12 లోపించినా.. ఈ పుట్టగొడుగుల్ని తీసుకుంటే స్వస్థత చేకూరుతుంది.

ఆధునిక జీవనశైలి వల్ల ముంచుకొస్తున్న వ్యాధులు కొన్నయితే.. వాతావరణ కాలుష్యం వల్ల తలెత్తుతున్న ఆరోగ్య సమస్యలు మరికొన్ని. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించే గుణాలు ఈ రకం పుట్టగొడుగులకు సొంతం. అందుకే ధర లక్షల్లో ఉంది..!

Next Story