ఐపీఎల్‌ నుంచి కోహ్లి సేన అవుట్‌.. సన్‌రైజర్స్ సూప‌ర్ విక్ట‌రీ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 Nov 2020 3:02 AM GMT
ఐపీఎల్‌ నుంచి కోహ్లి సేన అవుట్‌.. సన్‌రైజర్స్ సూప‌ర్ విక్ట‌రీ

కచ్చితంగా గెలవాల్సిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 6 వికెట్ల తేడాతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుపై ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌‌ ఫీల్డింగ్‌ ఎంచుకోగా.. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. బెంగుళూరు బ్యాట్స్‌మెన్‌ల‌లో ఏబీ డివిలియర్స్‌ (43 బంతుల్లో 56; 5 ఫోర్లు), ఫించ్‌ (30 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. సన్‌రైజర్స్ బౌల‌ర్ల‌లో హోల్డర్‌కు 3 వికెట్లు దక్కాయి.

అనంతరం ఛేద‌న‌కు దిగిన‌ హైదరాబాద్‌ 19.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ల‌క్ష్యాన్ని చేరుకుంది. ‘మ్యాన్‌‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కేన్‌ విలియమ్సన్‌ (44 బంతుల్లో 50 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), జేసన్‌ హోల్డర్‌ (20 బంతుల్లో 24 నాటౌట్‌; 3 ఫోర్లు) లు స‌మిష్టిగా రాణించి స‌న్‌రైజ‌ర్స్‌కు విజ‌యాన్ని క‌ట్ట‌బెట్టారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 47 బంతుల్లో 65 పరుగులు జోడించడం విశేషం. ఈ విజ‌యంతో బెంగుళూరు టోర్నీ నుండి నిష్క్ర‌మించి ఇంటిముఖం ప‌ట్ట‌గా.. ఆదివారం జరిగే రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో హైదరాబాద్‌ తలపడుతుంది.

Next Story