టిక్‌టాక్ వీడియోలు ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పిన వార్నర్
By తోట వంశీ కుమార్ Published on 21 Jun 2020 9:35 AM GMTకరోనా మహమ్మారి కారణంగా క్రీడారంగం కుదేలైంది. కరోనా ముప్పుతో కొన్ని క్రీడలు వాయిదా పడగా.. మరికొన్ని రద్దు అయ్యాయి. దీంతో క్రీడాకారులంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. లాక్‌డౌన్‌లో ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ తనలోని కొత్తకోణాన్ని చూపించాడు. బంతిపై విరుచుకు పడే వార్నర్‌లో ఓ మంచి డ్యాన్సర్ ఉన్నాడు అనే విషయాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు. టిక్‌టాక్‌లో వార్నర్ చేసిన వీడియోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు వార్నర్. తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి తెలుగు చిత్రాల్లోని పాటలలో పాటు కొన్ని డైలాగ్‌లను టిక్‌టాక్‌లో చెప్పి అలరించాడు. తాజాగా వార్నర్ మీడియాతో మాట్లాడుతూ.. తాను ఎందుకు టిక్‌టాక్ వీడియోలు చేయాల్సింది వచ్చిందో చెప్పుకొచ్చాడు ఈ విధ్వంసకర వీరుడు. ప్రజల ముఖాలపై చిరునవ్వులు తేవడానికే తన వంతుగా ఈ ప్రయత్నం చేసినట్లు చెప్పుకొచ్చాడు. మనం మన ఆలోచన పరిధిని మించి ఆలోచించాలి. కరోనా కష్ట సమయంలో ప్రజల ముఖాలపై చిరునవ్వులు తేవడానికే సోషల్ మీడియా ద్వారా నా కుటుంబ సభ్యులతో కలిసి ఆ వీడియోలు చేశానని వార్నర్ అన్నాడు.
'బుట్టబొమ్మా' సాంగ్ ను అభిమానుల కోరిక మేరకు చేశానన్నాడు. ఆ తరువాత వరుసగా వీడియోలు చేశా. ఇక అభిమానులు అడిగిన చాలా వాటికి నేను, నా భార్య కలిసి డ్యాన్స్ చేసి అలరించానన్నాడు. దీన్ని చాలా అస్వాదించానని, భారతీయ స్టెప్పులు చాలా కష్టంగా ఉన్నాయని, వాటిని చేయాలంటే ఎక్కువ శ్రమించాలన్నాడు. ఇక క్రికెటర్ కావడం పట్ల సంతోషిస్తున్నానని చెప్పాడు.