'శీత' వెళ్లాల్సిన సమయం ఆసన్నమవ్వకుండానే..

By రాణి  Published on  29 Jan 2020 3:18 PM IST
శీత వెళ్లాల్సిన సమయం ఆసన్నమవ్వకుండానే..

ముఖ్యాంశాలు

    • ఎండలు బాబోయ్ ఎండలు..
    • మార్చి రాకుండానే భగభగమంటున్న భానుడు
    • జనవరిలోనే ఇరగకాస్తున్న ఎండలు
    • ఖమ్మంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు

మూడు కాలాలు..ఆరు ఋతువులు అని చిన్నప్పుడు మనకు స్కూల్లో మాస్టార్లు పాఠాల్లో చెప్పేవారు. కానీ ఇప్పుడు పిల్లలకు ఇవే చెప్తే అబద్ధాలు చెప్తున్నారు అంటారు. వారు అన్నా ఆశ్చర్య పడాల్సిందేమీ లేదు. సంవత్సరానికి మూడు కాలాలు ఉండాల్సింది కాస్త...రాను రాను రెండు కాలాలే మిగిలేలా ఉన్నాయ్. 'శీత'కాలం వెళ్లకుండానే రావణుడిలా వచ్చేస్తున్నాడు సూర్యుడు. వేసవి కాలం, వర్షాకాలం, శీతాకాలం..ప్రతి కాలం నాలుగు నెలల పాటు ఉండాలి. కానీ...వర్షాలు ఎక్కువ పడితే శీతాకాలం కనుమరుగైనట్లు అనిపిస్తుంది. శీతాకాలం చలి ఎక్కువ ఉందంటే...వానలు తక్కువ కురుస్తున్నాయ్. ఎటొచ్చి వేసవి కాలం మాత్రం రావాల్సిన సమయానికన్నా ముందే వచ్చేస్తోంది.

సాధారణంగా మహా శివరాత్రి నాటికి చలి శివ శివ అంటూ వెళ్లిపోతుందని, ఆ తర్వాత నుంచి ఎండాకాలం మొదలవుతుంది పెద్దలు చెప్పే మాట. మన మాస్టార్లేమో మార్చి నుంచి వేసవి వస్తుందని చెప్తుంటారు. కానీ...ఈసారి చలి ముందే పారిపోయింది. ఈసారి శీతాకాలం మొత్తం రెండ్రోజులే చలి తీవ్రత ఎక్కువగా ఉందట. 2019 డిసెంబర్ 28,29 తేదీల్లో మాత్రమే చలి తీవ్రత ఉంది. ఈ రెండ్రోజులు మాత్రం అసలైన శీతాకాలంలా ఉంది. మిగతా రోజుల్లో పెద్దగా చలి ఏం లేదని వాతావరణ శాఖ చెప్తోంది. ఏటా హైదరాబాద్ లో శీతాకాలం వస్తే కనీస ఉష్ణోగ్రతలు 10-11 డిగ్రీల కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతుండేవి..కానీ ఈసారి నమోదైన కనిష్ట ఉష్ణోగ్రత 14.5 డిగ్రీలే. అత్యల్పంగా తెలంగాణలోని ఆదిలాబాద్ డిసెంబర్ 29న 6.5 డిగ్రీలు నమోదైంది. ఇక్కడే 2017 డిసెంబర్ 27న 3.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై..ఆల్ టైం రికార్డు సాధించింది. 2018 డిసెంబర్ 29న 4.4 డిగ్రీలు నమోదైంది. అంటే ఏటా రెండేసి డిగ్రీల మేర శీతాకాల కనిష్ట ఉష్ణోగ్రత పెరుగుతుందన్నమాట. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు..శీతాకాలం ఎంత త్వరగా వెళ్లిపోయిందో.

సూర్యుడికి కోపం బాగా వచ్చినట్లుంది. జనవరి నెల కూడా పూర్తవకుండానే మండిపోతున్నాడు. ఉదయం 9 గంటల నుంచి గూబ గుయ్ మనేలా కాస్తున్నాయ్ ఎండలు. వాతావరణంలో పెరిగిపోతున్న పొల్యూషన్, కర్బన సమ్మేళనం కారణంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే రోజులు క్రమ క్రమంగా పెరిగిపోతున్నాయ్. గడిచిన రెండ్రోజుల్లో సాధారణం కన్నా 3.4 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వేసవి ప్రారంభంలో ఎండలెలా ఉంటాయో..ఇప్పుడు ఉష్ణోగ్రతలు అలా నమోదవుతున్నాయి. గత పదేళ్ల కాలంలో జనవరి నెలలో ఎన్నడూ లేని విధంగా మంగళవారం ఖమ్మంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

అత్యధికంగా నమోదైన ఉష్ణోగ్రతలు

మంగళవారం ఖమ్మంలో 33.8 డిగ్రీలు, మహబూబ్ నగర్ లో 34.9, నిజామాబాద్ లో 34.4, భద్రాచలంలో 34.2, రామగుండం, హైదరాబాద్, హన్మకొండలలో 33 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అన్ని ప్రాంతాల్లో సాధారణం కన్నా 5 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పుడే ఇలా ఉంటే..ఇక మార్చి వస్తే..భానుడి భగభగలకు అందరూ మల మలా మాడిపోతారేమో అన్నట్లుంది పరిస్థితి. శీతాకాలంలో చల్లటినీరు తాగలేం. వేసవిలో వేడినీరు ముట్టలేం. అయినా మనకి అక్కర్లేనివే దొరుకుతాయ్. పూర్తి వేసవి వస్తే...జూస్ సెంటర్లు కిటకిటలాడాల్సిందే. కేవలం చల్లదనం కోసం షాపింగ్ మాల్స్ కి వెళ్లేవారు కూడా ఉంటారు. ఈ ఏడాది సూర్యుడి టార్గెట్ కి చిక్కకుండా...కాస్త నీడపట్టున ఉండేందుకు ప్రయత్నించండి. లేదంటే....అంతే సంగతులు ఇక.

Next Story