అర్ధ‌రాత్రికి స‌మ‌యం ద‌గ్గ‌రప‌డుతున్నా..

By Newsmeter.Network  Published on  31 Dec 2019 7:06 AM GMT
అర్ధ‌రాత్రికి స‌మ‌యం ద‌గ్గ‌రప‌డుతున్నా..

సీన్ క‌ట్ చేస్తే, హీరో.. హీరోయిన్ ఇళ్లు ఉన్న వీధిలో రాత్రి 10 గంట‌ల వ్యూ. అప్ప‌టికే ఆ ప్రాంతమంతా చ‌ల్ల‌టి జాబిలితో నిండి ఉంటుంది. మ‌రోప‌క్క‌ ఆకాశం నుంచి వెన్నెల‌ను కురిపిస్తున్న‌ట్టు చంద్రుడి విజువ‌ల్‌. ఆ రోజు ఏమైందో ఏమో అర్ధ‌రాత్రికి స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్నా హీరోయిన్‌కు నిద్ర ప‌ట్ట‌దు. ఏం చేయాలో తోచ‌క ఇంటి బాల్క‌నిలో కుర్చీలో కూర్చొని పుస్త‌కం చ‌దువుతుంటుంది.

Image (20)

వెంట‌నే కెమెరా డైవ‌ర్ష‌న్ తీసుకుని హీరో ఇంటివైపుకు తిరుగుతుంది. (అప్ప‌టికే హీరో జ‌రిగిన క‌థ‌లో ఎన్నోసార్లు త‌న ప్రేమ వ్య‌వ‌హారాన్ని చెప్పి హీరోయిన్‌తో తిట్లు తినుంటాడు). హీరో కూడా నిద్ర‌పోకుండా హీరోయిన్‌ను ఈ సారి ఎలా అయినా ఒప్పించాల‌ని ఆలోచిస్తుంటాడు. అదే స‌మ‌యంలో అనుకోకుండా కిటికీ నుంచి రోజా పువ్వు ప్ర‌తిభింభంలో హీరోయిన్ ముఖం క‌న‌ప‌డుతుంది.

సీన్ క‌ట్ చేస్తే, ఎదురింటి బాల్క‌నిలోని హీరోయిన్‌ను చూస్తూ హీరో త‌న ఇంటి మిద్దెపైకి ఎక్కుతాడు. ఇప్ప‌టికే త‌న ప్రేమ‌ను హీరోయిన్‌కు తెల‌ప‌డంలో ఎన్నోసార్లు ఫెయిల్ అయిన అనుభ‌వం హీరోది. ఇక ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కూడ‌ద‌ని భావించిన హీరో త‌న ప్రేమ విష‌యాన్ని ప‌రోక్షంగా హీరోయిన్‌కు తెలిపేందుకు జాబిల్లిని ఉద్దేశిస్తూ పాటందుకుంటాడు. అదే ''జాబిలమ్మ నీకు అంత కోపమా.. జాజిపూల మీద జాలి చూపుమా''

శ్రీ రాం ప్ర‌సాద్ ఆర్ట్ పిక్చ‌ర్స్ వారి బ్యాన‌ర్‌లో దివంగ‌త ద‌ర్శ‌కుడు కోడి రామ‌కృష్ణ ఏ నిముషాన ఆ చిత్రాన్ని ప్రారంభించారో కానీ సూప‌ర్ డూప‌ర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. 1997లో తెర‌కెక్కిన ఈ చిత్రంలోని పాట‌ల‌న్నీ శ్రోత‌ల మ‌దిలో ఇట్టే నిలిచిపోయాయి.

మ‌రీ ముఖ్యంగా జాబిల‌మ్మ నీకు అంత కోప‌మా అన్న పాట‌ను సినీ జ‌నాల ఇప్ప‌టికీ గానం చేస్తున్నారంటే అతిశ‌యోక్తి కాదు. సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం నుంచి జాలువారిన సాహిత్యానికి ఎస్పీ బాలు స్వ‌రం, ఎస్‌.ఏ.రాజ్‌కుమార్ బాణీలు తోడవ‌డంతో పుట్టిన‌దే ఈ ''జాబిల‌మ్మ నీకు అంత కోప‌మా''

నాడు శ్రోత‌లను తెగ ఆక‌ట్టుకున్న ఈ పాటను, అందులోని హీరో, హీరోయిన్‌ల హావ భావాల‌ను మ‌న తెలుగు యువ యాంక‌ర్లు విష్ణుప్రియ‌, సుడిగాలి సుధీర్‌ సేమ్ టు సేమ్ దించేశారు. లొకేష‌న్ వేరే అయినా ప్రేయ‌సి కోసం ప్రియుడు ప‌డుతున్న ఆరాటాన్ని సుధీర్ ఇట్టే పండించేశాడు. ఇక విష్ణు ప్రియ‌ న‌టించిందని చెప్ప‌డం క‌న్నా.. జీవించేసింద‌నే చెప్పాలి. తాజాగా విడుద‌లైన పోవే.. పోరా షో ప్రోమోపై మీరూ ఓ లుక్కేయండి.

Next Story
Share it