'కిలి'శిఖర ప్రయాణం.. వీగనిజం నినాదం
Inspiring Journey Of Kuragayala Sarada. గుంటూరుకు చెందిన కూరగాయల శారద.. నిన్నటి వరకు చాలామందికి తనో సీనియర్
By మధుసూదనరావు రామదుర్గం Published on 18 Sep 2021 8:19 AM GMTనా ఇజం.. వీగనిజం అంటున్న శారద
ఒక సున్నితమైన అంశాన్ని బలంగా చెప్పాలంటే ఒక కష్టమైన పనిని ఎంచుకోవాలి. అందుకే అందరికీ కనిపించేలా అందరికీ వినిపించేలా.. ప్రపంచంలో ఎత్తయిన పర్వతం కిలిమం జారోపై నిబ్బరంగా నిలుచుని శారద.. నేను వీగన్. నా ఆహారం నాలో శక్తిని ఏమాత్రం తగ్గించలేదు. జంతుహింస మానండి..అదే వీగనిజం.. నా ఇజం అంటూ నినదించారు. గూగుల్ సెర్చిలో కిలిమంజారో ఎక్కిన తొలొ వీగన్ మహిళగా పేరు నిలుపుకొన్నారు.
గుంటూరుకు చెందిన కూరగాయల శారద.. నిన్నటి వరకు చాలామందికి తనో సీనియర్ జర్నలిస్ట్ గానే పరిచయం, కానీ వీధి కుక్కలు, పిల్లుల్ని ప్రేమగా అక్కున చేర్చుకునే అనిమల్ లవర్ అని గానీ, జంతు హింసను నిరసిస్తూ.. చాలా ఏళ్ళుగా తన ఆహార అలవాట్లనే మార్చుకున్న వీగన్ అని చాలా మందికి తెలియదు. తనేదో, తన సిద్ధాంతమేదో అనుకునే శారద సహజంగానే ప్రచార,పరిచయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే మూడు నాలుగు రోజులుగా శారద పేరు మీడియాలో కనిపిస్తోంది.. వినిపిస్తోంది.. కారణం తను కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించడం. కిలిమంజారో అధిరోహించిన మొదటి మహిళా వీగన్ గా రికార్డు సృష్టించడం. ఉన్నపళాన మీడియాల్లో పేరు వినిపించినందుకు కాదు వీగన్ గా ప్రచారంలో ఉండటమే ఆసక్తి కలగిస్తోందంటారు.
వీగన్ కు విదేశీ స్పూర్తి..
ఏదైనా కఠిన నిర్ణయం తీసుకోవాలంటే బలమైన కారణం తప్పకుండా ఉండాలంటారు. మరి శారద వీగన్ గా ఎందుకు మారాలనుకుంది అన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఉంది. యూఎస్ లో చాలా కాలం జర్నలిస్ట్ గా రేడియోజాకీగా ఫ్రీలాన్స్ టీవీ రిపోర్టర్ గా పనిచేసిన శారదకు అక్కడ పూర్తి శాకాహారుల పరిచయం కలిగింది. జంతుహింస తప్పని భావించే చాలామంది జంతు ఆధారిత ఆహారాలను వద్దనుకుని జీవిస్తున్న విధానాన్ని గమనించారు. వారు అందరిలాగే జీవిస్తూ.. అరుదైన లక్ష్యాలను సాధించడం చూశారు. కొండలెక్కుతున్నారు.. సముద్రం ఈదుతున్నారు వీగన్ గా తమ శక్తి ఏంటో చూపగలుగుతున్నారు. ఆస్పూర్తితో శారద గత అయిదేళ్ళుగా వీగన్ గా ఉంటున్నారు. తను కూడా ఏదైనా రికార్డు సృష్టించయినా సరే వీగనిజాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాలని నిశ్చయించుకున్నారు. అప్పుడే కిలిమంజారో అధిరోహణకు తొలి అడగు పడింది.
కిలిమంజారో తన కల..:
ప్రపంచంలో ఎత్తయిన ఏడు శిఖరాల్లో ఒకటయిన కిలిమంజారో అధిరోహించాలని శారద కల. ఆఫ్రికన్ ఖండంలో అతి ఎత్తయిన 19,340 అడుగుల కిలిమంజారో పర్వత శిఖరం అధిరోహించడం చాలామంది కల. అయితే కలలు నిజం చేసుకోవాలంటే చెమటోడ్చాల్సిందే అని శారదకు తెలుసు. అందుకే గత ఆరునెలలుగా ఈ ట్రెక్కింగ్ కోసం తనను తాను సిద్ధం చేసుకుంటున్నారు. రోజూ క్రమం తప్పకుండా జిమ్ కు వెళ్ళేవారు. పరిమిత ఆహారం తీసుకునే వారు. అలాగని రోజూ వారీ పని మానలేదు. అందులో నిమగ్నమై ఉంటూనే తన జీవిత లక్ష్యం దిశగా అడుగులేశారు. లక్ష్యసాధన ఎపుడు నేరుగా సరళరేఖలా ఉండదు. మధ్యలో అవాంతరాలు వచ్చి పడుతుంటాయి. కొంతమందే గమ్యాన్ని సాధిస్తారు. శారద ఈ కోవకు చెందిన వారు.
అడ్డుకున్న కరోనా..:
అన్నీ సరిగా ఉంటే ఈపాటికి శారద కిలిమంజారో అధిరోహించి రెండుమూడు నెలలు కావల్సింది. కానీ అనుకోకుండా కరోనా కమ్ముకోవడంతో తన ఆకాంక్షకు కొంత కాలం విరామం కల్పించక తప్పలేదు. కానీ ఈ విరామ సమయంలో నిరాశ చెందక, సాధన ఏమాత్రం తగ్గకుండా చూసుకున్నారు. అసలే కరోనా కాలం.. పైగా కిలిమంజారో ప్రయాణం...రిస్క్ వద్దని తల్లిదండ్రులు వారించినా శారద పట్టు సడల లేదు. సెప్టంబర్ మొదటి వారంలో తన ప్రయాణం ఖరారైనపుడు ఉద్విగ్నానికి లోనయ్యారు. ఎపుడెపుడు కిలిమంజారో చేరుకుందామా అని ఉవ్విళ్ళూరారు. తన అయిదుగురు బృందంతో సెప్టెంబర్ 10న కిలిమంజారాలో వీగనిజం జెండా ఎగురవేశారు.
శిఖర అంచున భావోద్వేగం..:
మనుచరిత్రలో ప్రవరుడు హిమవత్పర్వతాన్ని చూసి వివశుడైనట్టే. కిలిమంజారో శిఖర అంచుల్ని చేరుకున్న వేళ శారద భావోద్వేగానికి లోనయ్యారు. ఆ క్షణాన...పర్వతం మానవత కన్నా ఉన్నతంగా కనిపించింది. ప్రకృతి మనుషుల కన్నా గొప్ప అనిపించింది. పర్వత సానువుల్లో ఘనీభవించిన నిశ్శబ్దం, శిఖర అంచుల నుంచి ఆత్మీయంగా పిలిచే చల్లని గాలి, ముత్యాల్లా మెరిసే మంచు తుంపరులు.. ఆనందిస్తూ.. ఆస్వాదిస్తూ మైమరచి పోయారు.. లక్ష్యం చేరుకున్నందుకు ఉప్పొంగి పోయారు. ప్రయాణం ఎంత కష్టమైనదైనా సరే గమ్యం చేరుకున్నాక లభించే ఆనందమే వేరంటారు శారద.
జంతుహింస మానండి..:
జంతువులకు మనలాగే సృష్టిలో బతికే హక్కు ఉంది. కేవలం ఆహారం పేరిట ఆ హక్కును లాగేసే హక్కు మనకుందా? మాంసాహారం లేకున్నా జీవితాన్ని అనుభవించవచ్చు ఆస్వాదించవచ్చు.. శక్తిని కూడగట్టుకోవచ్చు. అందుకు నేనే సాక్ష్యం. అయిదేళ్ళుగా వీగన్ గా ఉంటున్నా.. ఇవాళ ప్రపంచంలో అతి ఎత్తయిన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించా. వీగన్ గా మారండి.. జంతు హింస వీడండి.. ఇదే నా నినాదం. నా గొంతుకలో ఇది ధ్వనిస్తునే ఉంటుంది.. అన్నారు స్థిర చిత్తంతో శారద.