ఈ డిప్యూటీ త‌హ‌సీల్దార్ ఎలా ప్ర‌జ‌ల‌ను పొగాకు మానేలా చేస్తున్నారు

How this TS dy. tehsildar is getting people to quit tobacco. పొగాకు అల‌వాటు ఉన్న వారిని ఒప్పించి వారి చేత ఆ అల‌వాటును

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Nov 2022 5:47 AM GMT
ఈ డిప్యూటీ త‌హ‌సీల్దార్ ఎలా ప్ర‌జ‌ల‌ను పొగాకు మానేలా చేస్తున్నారు

సాధార‌ణంగా సినిమాలు చూసేట‌ప్పుడు అందులో ధూమ‌పానం చేస్తున్న దృశ్యాలు వ‌స్తున్న‌ప్పుడు "ధూమపానం ఆరోగ్యానికి హానికరం" అని పేర్కొంటూ ఒక డిస్‌క్లైమర్ కింద కనిపిస్తుండ‌డాన్ని గ‌మ‌నించే ఉంటారు. అయితే.. చాలా మంది దానిని ప‌ట్టించుకోరు. ధూమపానం మానేయమని ప్రజలకు బోధించే ప్రకటనల విషయంలో కూడా ఇదే పరిస్థితి. ఇక.. పొగాకు అల‌వాటు ఉన్న వారిని ఒప్పించి వారి చేత ఆ అల‌వాటును మానిపించ‌డం చాలా క‌ష్టంతో కూడుకున్న‌ది. అయితే.. తెలంగాణ వినియోగ‌దారుల వ్య‌వహారాలు, ఆహారం, పౌర‌సర‌ఫ‌రాల శాఖ‌కు చెందిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహశీల్దార్ మాచన రఘునందన్ ఈ విష‌యంలో విష‌యం సాధించారు.

భువ‌న‌గిరికి చెందిన రామ‌య్య అనే రైతు ఆధార్ కార్డులో అత‌డి పేరు రామ‌య్య‌కు బ‌దులుగా రామ‌ల‌మ్మ అని, లింగం స్త్రీ అని ప‌డింది. దీంతో అత‌డికి పింఛ‌న్ రాలేదు. 2021లో రామయ్య రైలు ప్రయాణంలో రఘునందన్‌ను కలిశాడు. ఈ విష‌యాన్ని రఘునందన్ తో పంచుకున్నాడు. రామ‌య్య‌ ఆధార్ ఆధారాలను సరిదిద్దడంలో ర‌ఘునంద‌న్ అతనికి సహాయం చేశాడు. ఇందుకు ప్ర‌తిగా రామ‌య్య రూ.5000ల‌ను ర‌ఘునంద‌న్‌కు ఇవ్వ‌జూడ‌గా అందుకు అత‌డు తిర‌స్క‌రించాడు. బ‌దులుగా ధూమ‌పానం మ‌నేయ‌మ‌ని అభ్య‌ర్థించారు.


ప్రభుత్వ అధికారి తీరు చూసి ఆశ్చర్యపోయిన రామయ్య పొగతాగడం మానేశాడు. అంతే కాదు జ‌రిగిన విష‌యాన్ని, త‌న గ్రామంలోని వారంద‌రికి చెప్పాడు. ఇతర రైతులకు ధూమపానం వారి ఆరోగ్యానికి ఎలా హానికరమో చెప్పాడు. "కొంత‌కాలం త‌రువాత అదే గ్రామ పంచాయతీ ఆ గ్రామాన్ని పొగాకు రహిత గ్రామంగా మార్చేందుకు కృషి చేయాలని తీర్మానం చేసింది" అని 46 ఏళ్ల రఘునందన్ గుర్తు చేసుకున్నారు.

రఘునందన్ స్వస్థలం మేడ్చల్ మల్కాజిగిరిలోని కేశవరం. అతను డ్యూటీ కోసం వెళ్లినప్పుడు, అతను వ్యక్తులను గమనిస్తాడు. పొగతాగేవారిని గుర్తిస్తాడు. వారి వద్దకు వెళ్లి పొగతాగడం వల్ల కలిగే దుష్పరిణామాలను వివరిస్తాడు. అంతేకాదు.. పొగ‌తాగే వారి వ్య‌క్తుల కుటంబాల‌తో మాట్లాడుతాడు. ధూమపానం మానేయడానికి వారి బంధువులతో కలిసి పని చేయమని ప్రోత్సహిస్తాడు.

అయితే.. అన్ని స‌మయాల్లో మాట‌ల ద్వారా కౌన్సెలింగ్ ప‌నిచేయ‌దు. సంపాదించాలంటే ఏదో పోగొట్టుకోవాలి అంటాడు రఘునందన్. "ఒకసారి, నేను ఒక వ్యక్తి యొక్క పిల్లల చదువుకు నిధులు సమకూర్చాను, కానీ అతను ధూమపానం మానేయడానికి సిద్ధంగా ఉంటేనే నేను అలా చేస్తానని చెప్పాను" అని ఆయన చెప్పారు. ధూమపానం మానేయమని అభ్యర్థిస్తూ ప్రతిఫలంగా ఆహారం, బట్టలు మరియు విద్యను అందించడం ద్వారా వేలాది మందికి సహాయం చేశాడు.


తన సన్నిహిత కాలేజీ స్నేహితుల్లో ఒకరైన దీక్షితులు స్మోకింగ్‌కి లొంగిపోవడంతో అతను దానిని ప్రారంభించాడు. "అతను నా కాలేజీ ఫీజు చెల్లించడంలో నాకు సహాయం చేసాడు. అతను 36 సంవత్సరాల వయస్సు వరకు ధూమపానం చేసేవాడు, అది చివరికి అతని మరణానికి దారితీసింది. అతను చనిపోయాక, నా హృద‌యం ముక్క‌లైంది," అని రఘునందన్ గుర్తు చేసుకున్నాడు. దాదాపు రెండు దశాబ్దాలుగా అతను ఈ పని చేస్తున్నారు.

వివిధ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ధూమపానం మానేయమని ప్రజలను ఎలా ప్రోత్సహిస్తున్నాయో కూడా రఘునందన్ చెప్పారు. "రాజస్థాన్‌లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు ధూమపానం మానేయాలని ప్రభుత్వం చెప్పింది. ఛత్తీస్‌గఢ్‌లో, ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి డ్యూటీ సమయంలో ధూమపానం చేస్తున్నట్లు తేలితే, అతనికి షోకాజ్ నోటీసు జారీ చేయబడుతుంది. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇలాంటి చొరవలను కలిగి ఉన్నాయి." అని ఆయన చెప్పారు.


రఘునందన్ ప్రయత్నాల ద్వారా వ‌ల్ల అనేక విడిపోయిన కుటుంబాలు ఒక్కటయ్యాయి. అనేక కుటుంబాలు మెరుగైన, సంతోషకరమైన జీవితాలను గడుపుతున్నాయి."ఒక వ్యక్తి సిగరెట్ కోసం వెచ్చించే అదే డబ్బును తన బిడ్డకు బొమ్మ కొనడానికి లేదా తన భార్యకు చీర కొనడానికి ఉపయోగించగలిగితే, అది అతని ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అంతేకాకుండా అతని కుటుంబం యొక్క ప్రేమను కూడా సంపాదించుకుంటుంది" అని ఆయన వివరించారు.

ప్రధాన మంత్రి కార్యాలయం, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, వివిధ పొగాకు నియంత్రణ సంస్థలు రఘునందన్ కృషిని అభినందించాయి.


పొగాకు ర‌హిత దేశంగా భార‌త్‌ను చూడాల‌నే త‌న క‌లను నిజం చేసుకునే వ‌ర‌కు ర‌ఘునంద‌న్ త‌న ప్ర‌య‌త్నాల‌ను కొన‌సాగిస్తూనే ఉంటాడు.

Next Story