ఒక్కోసారి పిల్లల ఆలోచనలు ఎటు పోతున్నాయో అర్థం కాకుండా ఉంది. వారికి ఉన్న తెలివిని సరైన మార్గంలో వినియోగించుకోక పోవటం మొత్తం సమాజాన్నే చిక్కుల్లో పడేస్తోంది. ఒక తొమ్మిదో తరగతి విద్యార్థి డబ్బు కోసం తాను చదువుతున్న స్కూల్ ప్రిన్సిపాల్ ను టార్గెట్ చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది.  తమకు రెండు లక్షలు ఇవ్వాలని.. లేకుంటే ఆర్మీపై పుల్వామాలో జరిగిన టెర్రరిస్టు దాడి తరహాలో బాంబు దాడి చేసి స్కూల్ ను పేల్చివేస్తామని బెదిరింపు లేఖ రాశాడు. అటు స్కూల్ బిల్డింగ్ లో, ఇటు ప్రిన్సిపాల్ ఇంట్లో కూడా ఈ లేఖలు విసిరేశాడు. తనకు వచ్చిన బెదిరింపు లేఖలు చూసిన ప్రిన్సిపాల్ భయంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్కూల్, ప్రిన్సిపాల్ ఇల్లు ఉన్న ప్రాంతాలను పరిశీలించిన పోలీసులు.. అదే స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి ఈ పని చేసినట్టు గుర్తించారు.

ఆ విద్యార్థి ప్రతిరోజు పొద్దున్నే న్యూస్ పేపర్ వేస్తాడని, తర్వాత స్కూలుకు వస్తాడని పోలీసులు చెప్పారు. అయితే పేపర్ చదివిన జ్ఞానాన్ని పిల్లడు వేరే రకంగా ఉపయోగించుకున్నాడని అన్నారు. బాలుడు రకరకాలుగా జవాబులు ఇచ్చి కొంత సమయం విసిగించాడని అయితే చివరికి కష్టపడకుండా డబ్బులు వస్తాయన్న ఉద్దేశంతో బెదిరింపు లేఖ రాశానని ఒప్పుకున్నాడని పోలీసులు వివరించారు. ఆ అబ్బాయిని పునరావాస కేంద్రానికి తరలించామని వెల్లడించారు.

సరిగ్గా ఏడాది కిందట ఫిబ్రవరి 14న జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో సైనిక వాహన శ్రేణిపై పాకిస్థాన్‌కు చెందిన జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు ఆత్మాహుతికి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కి  చెందిన 40 సైనికులు బలయ్యారు. ఈ దాడికి సంబంధిన  విషయాలన్నీ వారం రోజుల క్రితం అన్ని వార్త పత్రికలోనూ కధానాలుగా వచ్చాయని,  అవి చదివే పుల్వామా దాడి అన్ని మాటను బాలుడు ఉపయోగించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.