ఆ కిట్లన్నింటినీ వెంటనే వెనక్కు పంపండి : ఐసీఎంఆర్ ఆదేశం
By రాణి Published on 27 April 2020 9:50 PM ISTచైనా సంస్థలు గ్వాంగ్ జోహు వోండ్పో బయోటెక్, జుహాయి లివ్ జోన్ డయాగ్నస్టిక్స్ నుంచి దిగుమతి చేసుకున్న ర్యాపిడ్ కిట్లను తక్షణమే వెనక్కు పంపించేయాల్సిందిగా ఐసీఎంఆర్ ఆదేశించింది. కరోనా నిర్థారణ పరీక్షల కోసం ఈ రెండు సంస్థల నుంచి తీసుకొచ్చిన ర్యాపిడ్ కిట్లలో మిశ్రమ ఫలితాలొస్తున్న కారణంగా వాటితో పరీక్షలు చేయడం వెంటనే నిలిపివేయాల్సిందిగా ఐసీఎంఆర్ రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. సోమవారం ఐసీఎంఆర్ (భారత వైద్యపరిశోధనా మండలి) చీఫ్ బలరాం భార్గవ్ తో, ప్రధాని మోదీతో భేటీ అయి ఈ విషయంపై చర్చలు జరిపినట్లుగా కేంద్రవైద్యారోగ్య శాఖ అధికార వర్గాలు వెల్లడించాయి.
Also Read : మీ అకౌంట్ లో రూ.1500 పడ్డాయా ? ఇలా తెలుసుకోండి అంటూ మంత్రి ట్వీట్
భారత్ లో కరోనా నిర్థారణ పరీక్షలను వేగవంతం చేసేందుకు చైనా నుంచి తెప్పించుకున్న కిట్ల ద్వారా మిశ్రమ ఫలితాలొస్తున్నాయని కొన్ని రాష్ట్రాల నుంచి ఫిర్యాదులొచ్చిన నేపథ్యంలో ఐసీఎంఆర్ స్పందించింది. తమ నిపుణులను ఆయా రాష్ట్రాలకు పంపి వాటిపై ఆరా తీసింది. పరిశోధనలో రాష్ట్రాలు చేసిన ఫిర్యాదులు నిజమేనని తేలడంతో ఇప్పుడు వాటిని వాడటం ఆపివేయాలని ఆదేశించింది. కాగా ఐసీఎంఆర్ సిఫార్సు మేరకే కేంద్రం చైనా నుంచి 5 లక్షల రాపిడ్ యాంటీ బాడీ టెస్టింగ్ కిట్లతో పాటు, ఆర్ఎన్ఏ ఎక్స్ ట్రాక్షన్ కిట్లను కూడా తెప్పించి రాష్ట్రాలకు పంపింది. ఇప్పుడు కిట్లలో దాగి ఉన్న లొసుగులు వెల్లడవ్వడంతో తక్షణమే ఆ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది కేంద్రం.
Also Read :ఆది, వర్షిణిల మధ్య ఎఫైర్ నిజమేనా ?