అభిమానికి సవాలు విసిరిన బెన్ స్టోక్స్

By Newsmeter.Network  Published on  25 Jan 2020 11:07 AM GMT
అభిమానికి సవాలు విసిరిన బెన్ స్టోక్స్

ఇంగ్లాండ్‌ క్రికెట్‌ అభిమానుల చిరకాల కోరిక తీర్చిన హీరో బెన్ స్టోక్స్. క్రికెట్ పుట్టినల్లు ఇంగ్లాండ్‌ కు ప్రపంచ కప్‌ అందని ద్రాక్షగా మారగా.. దానిని అందించి ఇంగ్లాండ్‌ క్రికెట్‌ అభిమానుల్లో హీరోగా మారాడు. స్టోక్స్‌ ఎన్నిసార్లు హీరోగా నిలిచాడనే విషయాన్ని పక్కన పెడితే, ‘విలన్‌’ పాత్రలో ఇంకా మెరిపిస్తూనే ఉన్నాడు.

ముందు నోరు పారేసుకోవడం , ఆపై సారీలు చెప్పడం స్టోక్స్‌కు పరిపాటిగా మారిపోయింది. స్టోక్స్‌లో ఎంతటి ప్రతిభ ఉన్నప్పటికీ తన ప్రవర్తనతో ఇంగ్లండ్‌ అభిమానులకు, ఆ దేశ మాజీ క్రికెటర్లకు విసుగు తెప్పిస్తున్నాడు. గతంలో స్టోక్స్‌ను ఉద్దేశిస్తూ అతనిలో హీరో కాదు.. విలన్‌ ఉన్నాడు అని ఆ దేశ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ చేసిన వ్యాఖ్యలకు మరింత బలం చేకూర్చేవిధంగానే ఉంది తాజాగా జరిగిన ఘటన.

అసలేం జరిగిందంటే..

దక్షిణాఫ్రికాతో నాలుగవ టెస్టులో భాగంగా తొలి ఇన్నింగ్స్‌లో స్టోక్స్‌ 2 పరుగులకే ఔటై పెవిలియన్‌ చేరుతున్న క్రమంలో ఓ అభిమానిపై నోరు పారేసుకున్నాడు. సదరు అభిమాని ఏమన్నాడో తెలియదు కానీ, స్టోక్స్‌ మాత్రం అసభ్యపదజాలంతో దూషించాడు. గ్రౌండ్‌ బయటకొచ్చి మాట్లాడు.. నీ సంగతి చూస్తా అంటూనే బూతుపురాణం అందుకున్నాడు. దీనిపై మ్యాచ్‌ తర్వాత స్టోక్స్‌ క్షమాపణలు చెప్పాడు. తన భాష సరిగా లేదనే విషయాన్ని ఒప్పుకున్నాడు.

ఇలాంటి ఘటనలు స్టోక్స్ కు కొత్తేం కాదు.. దాదాపు రెండున్నరేళ్ల క్రితం జరిగిన బ్రిస్టల్‌ పబ్‌ ఉదంతం సగటు క్రీడాభిమానికి గుర్తుండే ఉంటుంది. విండీస్‌తో సిరీస్‌లో భాగంగా ఓ రోజు రాత్రి రాత్రి 2 గంటల సమయంలో పబ్‌ బయట ఓ వ్యక్తితో స్టోక్స్‌ గొడవకు దిగాడు. ఎదుటి వ్యక్తిని చంపే స్థాయిలో స్టోక్స్‌ దాడి చేశాడంటూ అప్పట్లో పెద్ద దుమారమే లేచింది. దాంతో చాలాకాలం ఇంగ్లండ్‌ జట్టుకు దూరమైన స్టోక్స్‌ ఎలాగోలా ఆ కేసు నుంచి బయటపడ్డాడు. ఆపై ఇంగ్లండ్‌ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన స్టోక్స్‌.. గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌ను ఇంగ్లండ్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.

Next Story
Share it