1022 టెస్టులు.. 5,00,000 రన్స్.. ఇదీ కథ.!
By Newsmeter.Network Published on 25 Jan 2020 10:07 AM GMTదక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇప్పటికే సుదీర్ఘ ఫార్మాట్ లో అత్యధిక మ్యాచులు ఆడిన రికార్డును సొంతం చేసుకున్న ఇంగ్లాండ్.. తాజాగా ఐదు లక్షల పరుగుల మార్కును అందుకుంది. అదేమిటి మ్యాచ్ లో మూడొందలు, నాలుగొందలు, మహా అయితే వెయ్యి పరుగులను చూశాం కానీ ఈ ఐదు లక్షల రన్స్ ఏమిటీ అని అంటారా.. ఏంలేదండి బాబూ ఇప్పటి వరకు ఇంగ్లాండ్ జట్టు టెస్టుల్లో చేసిన పరుగులండి.
ప్రస్తుతం ఇంగ్లాండ్ జోహెన్‌నెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో నాలుగవ టెస్టు మ్యాచ్ ఆడుతుంది. ఇది ఇంగ్లాండ్ కు 1022వ టెస్టు. కాగా శుక్రవారం ఆటలో ఆ జట్లు కెప్టెన్ జో రూట్ సింగిల్ తీయడం ద్వారా ఆ జట్టు ఐదు లక్షల టెస్టు పరుగుల్ని చేరింది. ఇక ఈ జాబితాలో ఆసీస్ రెండో స్థానంలో ఉంది. ఇప్పటివరకూ 830 టెస్టులు ఆడిన ఆస్ట్రేలియా 4,32, 706 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతోంది.
ఇక భారత్ జట్టు విషయానికి వస్తే 540 టెస్టులకు గాను 2,73,518 పరుగులతో మూడో స్థానంలో ఉండగా, వెస్టిండీస్ 545 టెస్టులతో 2,70,441 పరుగులతో నాల్గో స్థానంలో ఉంది. ఇదిలా ఉంచితే, దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో భాగంగా పోర్ట్ ఎలిజిబెత్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ ద్వారా ఇంగ్లండ్ మరో ఘనతను కూడా నమోదు చేసింది. విదేశీ గడ్డపై ఐదు వందలు టెస్టులు ఆడిన తొలి జట్టుగా ఇంగ్లండ్ నిలిచింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా(404) రెండో స్థానంలో ఉంది.