సచిన్ ద్విశతకాన్ని కించపరిచిన స్టెయిన్..!
By తోట వంశీ కుమార్ Published on 17 May 2020 4:33 PM ISTక్రికెట్‌లో భారత దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ సాధించని రికార్డులు లేవు. అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా, అత్యధిక టెస్టు, వన్డే పరుగులు చేసిన ఆటగాడిగా ఎన్నో రికార్డులు సచిన్ పేరు మీద ఉన్నాయి. ఇక వన్డేల్లో అసాధ్యం అనుకున్న ద్విశతకాన్ని సుసాధ్యం చేశాడు మాస్టర్ బ్లాస్టర్. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తొలి సారి ద్విశతకాన్ని సాధించింది సచిన్. 2010లో ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు టెండూల్కర్. కాగా.. దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ సచిన్ ద్విశతకాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశాడు.
గ్వాలియర్ వేదికగా 2010లో భారత్, సౌతాఫ్రికా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసింది భారత జట్టు. ఆ మ్యాచ్‌లో సచిన్ 190 పరుగుల వద్ద ఉన్నప్పుడు తాను ఔట్ చేశానని అయితే.. అంపైర్ ఔట్ ఇవ్వకపోవడంతో సచిన్ ద్విశతకం చేశాడని అన్నాడు డేల్ స్టెయిన్.
తాజాగా స్కైస్పోర్ట్స్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఈ సంచలన వ్యాఖ్యలు చేశాడు స్టెయిన్.'గ్వాలియర్ వేదికగా జరిగిన మ్యాచ్ లో సచిన్ మాపై ద్విశతకాన్ని సాధించాడు. అతను 190లో ఉండగా.. నేను ఎల్బీడబ్య్లూ చేశాను. అప్పుడు ఇయాన్ గౌల్డ్ అంపైర్‌గా ఉండి నాటౌటిచ్చాడు. నాకు ఏమీ అర్థం కాక గౌల్డ్ వైపు చూశా, అతని ముఖంలో ఏదో భయం కనపడింది. ఇదేం నిర్ణయం.. అవుట్ అయ్యాడు కదా.. నాట్ ఔట్ ఎందుకిచ్చావు? అనే ఉద్దేశంతో అంపైర్ వైపు చూశా. అంపైరేమో చుట్టూ జనాలను చూశావా.. సచిన్‌ను ఔట్ ఇస్తే నన్ను ఇక్కడినుంచి బయటకు కూడా వెళ్లనివ్వరనే ఉద్దేశంలో లో' పేర్కొన్నాడని స్టెయిన్ చెప్పుకొచ్చాడు.
ఆ మ్యాచ్‌లో సచిన్ ద్విశతకంతో చెలరేగడంతో టీమ్ఇండియా మూడు వికెట్లు కోల్పోయి 401 పరుగుల భారీ స్కోర్‌ను సాధించింది. ఈలక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన సౌతాఫ్రికా 248 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్ 153 పరుగులతో ఘన విజయాన్ని సాధించింది. స్టెయిన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది సచిన్ సాధించిన ద్విశతకాన్ని కించపరిచినట్లే. తన కెరీర్‌లో ఇప్పటి వరకు ఎలాంటి వివాదాలకు వెళ్లని సచిన్.. తాజాగా స్టెయిన్ చేసిన వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తాడో చూడాలి.
సచిన్ తరువాత రోహిత్‌శర్మ, వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్‌గేల్, మార్టిన్ గప్టిల్ వంటి ఆటగాళ్లు ద్విశతకాన్ని అందుకున్నారు. ఇందులో రోహిత్ శర్మ అత్యధికంగా మూడు సార్లు ఈ ఘనత సాధించాడు.