స్టీవియా - ఒక స్వీట్ ఆల్టర్నేటివ్

By అంజి  Published on  19 Jan 2020 4:19 PM IST
స్టీవియా - ఒక స్వీట్ ఆల్టర్నేటివ్

ముఖ్యాంశాలు

  • డయాబెటీస్ రోగులకు శుభవార్త
  • చక్కెరకు చక్కటి ఆయుర్వేద ప్రత్యామ్నాయం
  • పైగా ఇందులో ఔషధ గుణాలుకూడా అదనం
  • స్టీవియా మొక్క ఆకులు అద్భుతమైన స్వీట్ నర్
  • విస్తృత స్థాయిలో పరిశోధనలు చేసిన నాగజ్యోతి
  • స్టుగర్ పేరుతో కొత్త స్వీట్ నర్ తయారీ
  • స్టుగర్ ప్రాడక్ట్ కి ఎఫ్.సి.సి.ఎ.ఐ ఆమోదం

హైదరాబాద్ కి చెందిన నాగజ్యోతికి అద్భుతాలు సాధించడమంటే చాలా ఇష్టం. తను ఎంచుకునే లక్ష్యాలు పూర్తిగా విభిన్నంగా ఉంటాయి. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించడమంటే ఆమెకు చాలా ఇష్టం. ఇప్పుడు ఆమె ఎంచుకున్న సమున్నతమైన లక్ష్యం ఏంటంటే భారతదేశానికి సుగర్ వ్యాధినుంచి పూర్తిగా విముక్తి కల్పించడం.

నిజానికి ఇదేం అషామాషీ వ్యవహారం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎండోక్రోనాలజిస్టులు, అద్భుతమైన పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు, వైద్య విజ్ఞాన సర్వస్వాన్నీ మధిస్తున్న మేధావులూ సాధించలేని, దగ్గరిదాపుల్లో సాధించడానికి వీలవుతుందని అనుకోవడానికికూడా లేని అత్యంత క్లిష్టతరమైన లక్ష్యం ఇది.

మహామహులకు సాధ్యంకానిది నీవల్ల అవుతుందా అంటూ కొందరు పెదవి విరిచారు. అబ్బే ఆట్టే టైమ్ వేస్టుచేసుకోకుండా చక్కగా ఏదైనా పనికొచ్చే పని చేయరాదు, పుణ్యం, పురుషార్థం రెండూ దక్కుతాయి అన్నవాళ్లుకూడా ఉన్నారు. ఈ పిల్ల ఏదో సాధ్యంకానిదాన్ని పట్టుకుని మొత్తం జీవితంలో విలువైన సమయాన్నంతా వృథా చేసుకుంటోంది అన్నవాళ్లూ ఉన్నారు.

ఎవరేం అనుకుంటే నాకేంటి? అందరూ ఏవో కాసిన పనికొచ్చే మాటలో లేక పనికిరాని మాటలో చెప్పేవాళ్లేగానీ అనేసుకుంది ఈ డైనమిక్ లేడీ. రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృత స్థాయిలో రీసెర్చ్ చెయ్యడం మొదలుపెట్టింది. స్టీవియా ప్లాంట్ ఆధారంగా రూపొందించిన సుగర్ కి ప్రత్యామ్నాయమైన స్టుగర్ ని తయారుచేసింది.

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అధారిటీ ఆఫ్ ఇండియా నాగజ్యోతి తయారుచేసిన స్టుగర్ కి ఆ ప్రొడక్ట్ ప్రమాణాలకు అనుగుణంగానే ఉందని, దాన్ని వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని ఆమోదముద్ర వేసింది. ఇంకేం నాగజ్యోతి అలుపెరగకుండా తను కొత్తగా తయారుచేసిన స్టుగర్ పనితనాన్ని పూర్తి స్థాయిలో పరీక్షించడం మొదలుపెట్టింది.

మొక్కల పట్ల ప్రేమ

మొక్కలంటే ఉన్న అపరిమితమైన ఇష్టం కారణంగా నాగజ్యోతి అగ్రికల్చరల్ బి.ఎస్.సి చదివింది. వెంటనే అగ్రిబిజినెస్ మ్యానేజ్ మెంట్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేసేసింది. తనకున్న ఇష్టాన్ని పూర్తి స్థాయిలో కెరీర్ గా మలచుకోవాలన్న ఆమె ఆశకు చక్కగా నీళ్లు పోసి తనకు చాలా ఇష్టమైన మొక్కను పెంచినట్టుగా పెంచడం మొదలుపెట్టింది.

నిజానికి చుట్టూ ఉన్నవాళ్ల ఒత్తిడులకు, ఇంట్లోవాళ్ల ఒత్తిడులకు తలొగ్గిన నాగజ్యోతి మొదట అందరిలాగే ఒరవడిలో కొట్టుకుపోయే పనులే చేసింది. చదువు పూర్తి కాగానే బ్యాంకింగ్ సెక్టర్ లో కొంతకాలం, ఆ తర్వాత డెవలప్ మెంట్ సెక్టర్ లో కొంతకాలం పనిచేసింది. తర్వాతి దశలో అనుకోకుండా ఆమెకు రైతులతో, వ్యవసాయదారులతో పరిచయాలు ఏర్పడ్డాయి. కొంతకాలంపాటు వారికి సేవలు అందించడం, వారితో కలిసి పనిచెయ్యడం ఆమెకు కలిసొచ్చింది.

ఎంతోకాలంగా తనలో నిద్రాణమై ఉన్న మొక్కల పట్ల ప్రేమ ఒక్కసారిగా పెల్లుబికి ఉద్ధృతమై పైకి పొంగుకొచ్చింది. సరిగ్గా అప్పుడే ఓ చిన్న పేపర్ ఆర్టికల్ ఆమె జీవితాన్ని కొత్త మలుపు తిప్పింది. ఆరోగ్యంకోసం జనం మాంసాహారాన్ని విడిచిపెట్టి శాకాహారంవైపుకు ఎలా మొగ్గుచూపుతున్నారో వివరించే ఆర్టికల్ అది.

అప్పట్నుంచీ నాగజ్యోతి మాంసాహారానికి ప్రతిగా అదే స్థాయిలో ప్రోటీన్లను, రుచినీ అందించే శాకాహార ప్రత్యామ్నాయాలకోసం రీసెర్చ్ చేసింది. వెంటనే ఆమెకు దొరికిన సమాధానం పుట్టగొడుగులు. అలా రీసెర్చ్ చేస్తున్న సమయంలో దేశంలో ఎంతోమంది సుగర్ వ్యాధితో బాధపడుతున్నారన్న ఆలోచన ఆమె మనసును ఎంతో బాధపెడుతూ ఉండేది.

ఉన్నట్టుండి ఒక రోజు సరే అసలు చక్కెరవల్ల అన్ని రకాల అనర్థాలు ఉన్నప్పుడు నేరుగా చక్కెరకు ప్రత్యమ్నాయాన్ని ఏదైనా కనుక్కుంటే పోలా అన్న ఆలోచన ఆమెకు వచ్చింది. “నిజానికి మార్కెట్లో చక్కెరకు ప్రత్యామ్నాయంగా బోలెడన్ని కెమికల్ స్వీట్ నర్స్ ఉన్నాయి. కానీ నేనుమాత్రం ప్రకృతి సిద్ధమైన, సహజమైన స్వీటనర్ కోసం అన్వేషించాను. అలా వెతుకుతూ వెతుకుతూ ఉండగా నా అన్వేషణ ఫలించింది” అని చెప్పింది నాగజ్యోతి.

స్టీవియా ప్లాంట్..

అలా వెతకగా వెతకగా నాగజ్యోతికి కొన్నాళ్ల తర్వాత స్టీవియా ప్లాంట్ గురించి తెలిసింది. ఇది పూర్తిగా చక్కెరకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడే స్వీట్ నర్ అన్న విషయాన్ని తెలుసుకున్న తర్వాత మరింత లోతుగా పరిశోధనలు చేసింది. పైగా ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే స్టీవియాకు అత్యద్భుతమైన అనేక ఔషధ గుణాలున్నాయి.

కేవలం ఇది స్వీట్ నర్ గా పనిచెయ్యడమే కాక బ్లడ్ గ్లూకోజ్ ని నియంత్రించి సరైన స్థాయిలో ఉంచగలిగిన అద్భుతమైన ఔషధంగా కూడా ఇది పనిచేస్తుంది. అంటే ఒకే మొక్కతో రెండు లాభాలు. ఒకటి స్వీట్ నర్ గా ఉపయోగపడడం. రెండోది బ్లడ్ గ్లూకోజ్ ని అదుపులో పెట్టడం. ఈ రెండూ లక్షణాలూ సుగర్ వ్యాధిగ్రస్తుల పాలిట అమృతతుల్యమైన, అత్యద్భుతమైన వరాలు.

స్టీవియా పూర్తి స్థాయిలో చక్కగా ఉపయోగించుకోదగిన స్వీట్ నర్. కానీ కొందరు ఇది వగరుగా ఉందని, చేదుగా ఉందని కూడా భావిస్తారు. కేవలం అవన్నీ వాళ్ల మానసిక భావనలు తప్ప నిజంకాదు. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా చక్కెరకు అలవాటు పడిపోయిన ప్రాణం ఒక్కసారిగా దాన్ని వదలుకోవడానికి ఇష్టపడదు.

అది మనసుకు ఉండే బలహీనత. ఆ బలహీనతను జయిస్తే స్టీవియా గొప్పదనాన్ని ఒకేఒక్క క్షణంలో గుర్తించడానికి, ఆ రుచిని ఆస్వాదించడానికీ వీలు కలుగుతుందని నాగజ్యోతి చెబుతోంది. కేవలం స్టీవియాని నిత్య జీవితంలో ఉపయోగించడం ద్వారా డయాబెటీస్ రోగులు వీలైనంతగా మందుల వాడకాన్ని తగ్గించుకుని చక్కగా డయాబెటీస్ ని కంట్రోల్లో పెట్టుకోవచ్చని, ఇందులో అణుమాత్రమైనా సందేహం లేదని చెబుతోందీ నవతరం నారీమణి.

Next Story