ముగిసిన నిషేదం.. కెప్టెన్సీ రేసులో స్మిత్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 March 2020 5:53 PM IST
ముగిసిన నిషేదం.. కెప్టెన్సీ రేసులో స్మిత్

ద‌క్షిణాఫ్రికాతో రెండేళ్ల క్రితం కేప్‌టౌన్‌లో జ‌రిగిన టెస్టు మ్యాచ్‌లో బాల్ ట్యాంప‌రింగ్ ఉదంతం కార‌ణంగా ఏడాది పాటు నిషేదానికి గురైన ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్.. మ‌ళ్లీ జ‌ట్టు కెప్టెన్సీ బాధ్య‌త‌లు చేప‌ట్టేందుకు అర్హ‌త సాధించాడు. నిషేదం కార‌ణంగా ఏడాది పాటు క్రికెట్ దూర‌మైన స్మిత్.. గ‌తేడాది యాషెస్ సిరీస్ ద్వారా టెస్టుల్లో రీఎంట్రీ ఇచ్చాడు. ఆ సిరీస్‌లో విశేషంగా రాణించి త‌నలో స‌త్తా త‌గ్గ‌లేద‌ని నిరూపించాడు. రీ ఎంట్రీ ఇచ్చిన‌ప్ప‌టికి రెండేళ్ల పాటు కెప్టెన్సీ చేప‌ట్ట‌కుండా క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ఆంక్ష‌లు విధించింది. అయితే ఈ నిషేదాన్ని కూడా స్మిత్ పూర్తి చేసుకున్నాడు. 2020, మార్చి 29వ(ఆదివారం) తేదీతో స్మిత్‌పై ఉన్న రెండేళ్ల పాటు కెప్టెన్సీకి దూరంగా ఉండాలన్న నిషేధం ముగిసింది.

స్మిత్ పై నిషేదం విధించిన స‌మ‌యంలో ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్‌గా టీమ్ ఫైన్ ఎంపిక కాగా.. ప‌రిమిత ఓవ‌ర్ల కెప్టెన్‌గా ఆరోన్ ఫించ్ బాధ్య‌త‌లు చేప‌ట్టాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఫించ్‌ను తప్పించాలనే ఆలోచనలో సీఏ లేదు. అలాడే పైన్‌ కూడా టెస్టుల్లో కొనసాగించాలనే చూస్తోంది. వీరిద్దరి కెప్టెన్సీపై కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ ఇటీవల ప్రశంసలు కురిపించాడు. ప్రత్యేకంగా టిమ్‌ పైన్‌ నాయకత్వ లక్షణాలు అమోఘం అంటూ కొనియాడాడు. అదే సమయంలో స్మిత్‌కు అదనపు భారాన్ని ఇవ్వడం కూడా ఆసీస్‌ క్రికెట్‌ పెద్దలకు ఇష్టం లేదు. కెప్టెన్‌గా స్మిత్‌ సమర్థుడైనప్పటికీ ఆ బాధ్యతలు అప్పచెప్పి బ్యాటింగ్‌ ఒత్తిడి తీసుకురాకూడదనేది సీఏ యోచన. రాబోవు సిరీస్‌ల్లో పైన్‌, ఫించ్‌లు కెప్టెన్‌లుగా విఫలమైతే మాత్రం మళ్లీ స్మిత్‌నే సారథిగా చేసే అవకాశం ఉంది.

క‌రోనా వైర‌స్ ధాటికి ఈ ఏడాది అక్టోబ‌ర్‌లో భార‌త క్రికెట్ జ‌ట్టు ఆస్ట్రేలియాలో ప‌ర్య‌టించ‌డం అనుమానంగా మారింది. ఆ దేశంలో ఆరు నెల‌ల పాటు విమానాల రాక‌పోక‌ల్ని నిలిపివేస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. అక్టోబ‌ర్ 18న ఆస్ట్రేలియా వేదిక‌గా టీ20 ప్ర‌పంచ‌క‌ప్ జ‌ర‌గ‌నుంది. ఆ నెల ఆరంభంలో మూడు టీ20ల సిరీస్ కోసం భార‌త జ‌ట్టు ప‌ర్య‌టించాల్సి ఉంది. ఆరు నెల‌ల పాటు విమాన రాక‌పోక‌ల్ని ఆపేస్తుండ‌డంతో ఆస్ట్రేలియాలో భార‌త ప‌ర్య‌ట‌నపై సందిగ్ద‌త నెల‌కొంది. దీంతో టీ20 ప్ర‌పంచ క‌ప్‌ను సైతం వాయిదా వేసే ఆలోచ‌న‌లో ఉంది ఐసీసీ.

Next Story