మహా తెలివి.. కరోనా అనుమానితుల చేతిపై స్టాంప్‌..

కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) అందర్ని వణికిస్తోంది. ఇప్పటకే ఈ మహమ్మారి బారీన పడి 7వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. లక్షకు పైగా కరోనా బాధితులు ఉన్నారు. ఇక భారతదేశంలో కరోనా వైరస్‌ రోజురోజుకు విస్తరిస్తోంది. భారత్‌లో నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసుల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. కరోనా వైరస్‌ కట్టడి కోసం మహారాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఇళ్లలోనే క్వారంటైన్‌లో ఉన్న కరోనా అనుమానితుల ఎడమ చేతిపై చెరిగిపోని ఇంకుతో స్టాంపు వేయాలని నిర్ణయించింది.

ఆ స్టాంప్‌లో ‘ముంబై ప్రజలను రక్షిస్తున్నందుకు గర్వపడుతున్నాను’ అని రాసి ఉంచారు. అలాగే వారి ఎప్పటివరకు క్వారంటైన్‌లో ఉండాలో కూడా పేర్కొన్నారు. ఇలా చేయడం ద్వారా కరోనా అనుమానితులను గుర్తించడం సులభతరం అవుతుందని.. వారు సాధారణ ప్రజలతో కలవకుండా నిరోధించవచ్చని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే తెలిపారు. ఇరాన్‌లో రెండు కేసులతో మొదలైన కరోనా వైరస్‌.. రెండో వారంలో 43, మూడో వారంలో 245, ఐదో వారంలో 15,500కు చేరటాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇప్పటి వరకు మహారాష్ట్రలో 36 మందికి కరోనా సోకింది.

Stamps Left Hand Coronavirus Suspects

కాగా, గతంలో కొందరకు కరోనా అనుమానితులు ఆస్పత్రుల నుంచి పారిపోవడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 126 మందికి కరోనా సోకిందని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. మరోపక్క మహారాష్ట్ర నుంచి వచ్చే వారిపై ప్రత్యేకంగా నిఘా పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తీవ్ర శ్వాసకోశ వ్యాధులతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందే వారి సమాచారాన్నీ సేకరించాలని తీర్మానించింది. శనివారం నుంచి వరుసగా ప్రతిరోజూ ఒక్కో కేసు నమోదు కావడంతో.. తెలంగాణ సర్కార్ ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది.

Vamshi Kumar Thota

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *