సూర్యాపేటలో ప్రేమోన్మాది ఘాతుకం

By Newsmeter.Network  Published on  29 Feb 2020 11:36 AM GMT
సూర్యాపేటలో ప్రేమోన్మాది ఘాతుకం

ఎన్ని కఠిన చట్టాలు తెచ్చిన మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. దేశంలో నిత్యం ఏదో ఒక చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రేమను నిరాకరించిందని మారణాయుధాలతో దాడులు చేయడం.. నిలువునా మంటల్లో కాల్చేస్తున్న ఘటనలు కలవర పరుస్తున్నాయి. నాగ్‌పూర్‌లో ఓ ప్రేమోన్మాది.. లేడీ లెక్చరర్‌పై పెట్రోల్ పోసి నిప్పింటించిన ఘటన మరువక ముందే తాజాగా తెలంగాణలో మరో దారుణం జరిగింది.

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం రాఘవాపురంలో ఓ బాలికను కొద్దికాలంగా ఓ యువకుడు ప్రేమ పేరుతో వేదిస్తున్నాడు. వెంటపడి, బతిమిలాడుకున్న ఆమె పట్టించుకోలేదు. దీంతో అతనిలోని మానవమృగం నిద్రలేచింది. తన ప్రేమను నిరాకరించిందన్న కోపంతో బాలికను అత్యాచారం చేశాడు. అనంతరం ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్లుగానే బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించి.. అక్కడి నుంచి పరారయ్యాడు.

ఒళ్లంతా మంటలు వ్యాపించడంతో బాలిక కేకలు వేస్తూ బయటకు రావడంతో స్థానికులు స్పందించి మంటలను ఆర్పివేశారు. ప్రస్తుతం తీవ్ర గాయాలతో ఆ బాలిక వరంగల్ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని వెంకటేష్‌గా గుర్తించారు. రెండేళ్లుగా ప్రేమ పేరుతో ఆ బాలికను వేధిస్తున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Next Story
Share it