మృతుల సంఖ్య 42..పరిస్థితి అదుపు లోకి వచ్చేది ఎన్నడో..?

By రాణి  Published on  29 Feb 2020 6:37 AM GMT
మృతుల సంఖ్య 42..పరిస్థితి అదుపు లోకి వచ్చేది ఎన్నడో..?

నార్త్ ఈస్ట్ ఢిల్లీలో ఇంకా హింసాత్మక ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. గత అయిదు రోజుల్లో మృతి చెందిన వారి సంఖ్య 42 మందికి చేరింది. శుక్రవారం ఉదయం సమయంలో కూడా 60 సంవత్సరాల వ్యక్తిని కొట్టి చంపేశారు. పోలీసులు భారీ సంఖ్యలో అక్కడ మొహరించినప్పటికీ ఇలాంటి ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం..ఇప్పటి వరకూ 123 ఎఫ్.ఐ.ఆర్. లు నమోదయ్యాయి. ఇప్పటికే 620 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆ ప్రాంతంలో చాలా చోట్ల 'పీస్ కమిటీ మీటింగ్' లను నిర్వహించారు. నార్త్ ఈస్ట్ ఢిల్లీలో పరిస్థితిని చాలా వరకూ అదుపు చేశామని అడిషనల్ సి.పి. ఎం.ఎస్. రన్ ధావా మీడియాకు తెలిపారు.

శుక్రవారం చనిపోయిన వ్యక్తిని అయూబ్ అన్సారీగా పోలీసులు గుర్తించారు. ఘజియా బాద్ 'లోని' ప్రాంతానికి చెందిన అయూబ్ చెత్త ఏరుకుంటూ జీవనం సాగించేవాడు. శివ్ విహార్ కు అతడి ఇంటికి కేవలం రెండు కిలోమీటర్ల దూరం మాత్రమే..! ఇప్పటి వరకూ అయూబ్ విషయంలో ఎటువంటి అరెస్టులు జరగలేదు. రెండు రోజుల క్రితం జాతీయ భద్రతా సలహా దారు అజిత్ దోవల్ ఆ ప్రాంతానికి వెళ్ళారు.. హోమ్ మినిస్టర్ అమిత్ షా గురువారం నాడు స్పెషల్ మీటింగ్ ను ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించారు.

హింసాత్మక ఘటనల్లో చనిపోయిన వారిలో ఇప్పటి వరకూ 36 మందిని పోలీసులు గుర్తించారు. అయూబ్ కాకుండా శుక్రవారం నాడు చనిపోయిన వారిలో ముబారక్ హుస్సేన్(28), దిల్బర్ నేగి(20), మోనిస్(21), బబ్బూ సల్మాని(33), ఫైజన్ (24) గా గుర్తించారు. అయూబ్ కుమారుడు సల్మాన్ అన్సారీ మాట్లాడుతూ కొందరు వ్యక్తులు గాయాలతో ఉన్న తన తండ్రిని ఇంటికి తీసుకొని వచ్చారని.. వెంటనే తాము లోకల్ ఆసుపత్రికి తీసుకొని వెళ్ళమని సల్మాన్ అన్నాడు. ప్రథమ చికిత్స అనంతరం జీటీబీ ఆసుపత్రికి తీసుకుని వెళ్ళమని అడిగారని.. మార్గమధ్యమంలో ఉండగా తన తండ్రి ప్రాణాలు పోయాయని సల్మాన్ చెప్పుకొచ్చాడు. గత కొద్ది రోజులుగా తమ తండ్రి ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నాడని.. పరిస్థితి అదుపులో ఉందేమో అని భావించి ఉదయం 4-5 గంటల మధ్య కాలంలో చెత్తను సేకరించడానికి బయటకు వెళ్ళాడు.. కొద్దిసేపటికి తమ తండ్రిని కొందరు తీసుకుని రాగా అప్పటికే తల, శరీరం, కాళ్లపై తీవ్ర గాయాలయ్యాయని సల్మాన్ అన్నాడు. అప్పటికి తన తండ్రి మాట్లాడుతూనే ఉన్నాడని.. చెత్త సేకరించడానికి శివ్ విహార్ ప్రాంతానికి వెళ్లగా, అక్కడ కొందరు నీ పేరేంటి అని అడుగగానే.. అయూబ్ తన పేరు చెప్పగా.. అందరూ దాడి చేశారని చెప్పాడని సల్మాన్ మీడియాకు తెలిపాడు.

చెత్తబండి పైనే ఆస్పత్రికి..

యూపీ పోలీసులకు తాము ఫోన్ చేసి సహాయం కోసం అర్థించినా.. ఎటువంటి సహాయం వాళ్ళు చేయలేదని అన్నారు. దీంతో తమ చెత్త బండిపైనే తండ్రిని ఆసుపత్రికి చేర్చానని సల్మాన్ తెలిపాడు. సల్మాన్ కూడా చెత్త సేకరించే పని చేస్తుంటాడు. ఆ క్లినిక్ లో ఫస్ట్ ఎయిడ్ చేయించామని.. గాయాలకు బ్యాండేజ్ వేయించానని చెప్పిన సల్మాన్ ఆ తర్వాత వైద్య ఖర్చులకు 5000 రూపాయలు అవుతుందని అన్నారని.. అప్పుడు తన దగ్గర డబ్బులు లేవని అన్నాడు సల్మాన్. తన తండ్రికి ట్రీట్మెంట్ తప్పకుండా అవసరమని భావించి ఆటోలో తాము జీటీబీ ఆసుపత్రికి తీసుకుని వెళ్తుండగా.. ఆ సమయంలో తన తండ్రిలో చలనం లేకపోవడం.. రక్తం కారడం మొదలయ్యాయని.. ఆసుపత్రికి తీసుకుని వెళ్తున్న సమయంలోనే తన తండ్రి చనిపోయాడని మార్చురీ ముందు ఏడుస్తూ చెప్పాడు సల్మాన్. తామిద్దరం కలిసి రోజుకు 300-400 రూపాయలు సంపాదించే వాళ్లమని.. తన తల్లి చాలా రోజులుగా వేరుగా ఉంటోందని.. తనకు తోడుగా ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎవరూ లేరని ఏడుస్తూ చెప్పాడు సల్మాన్.

Next Story
Share it