ఇంగ్లాండ్‌లో కత్తిపోట్ల కలకలం.. విచక్షణారహితంగా దాడి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Sep 2020 2:38 PM GMT
ఇంగ్లాండ్‌లో కత్తిపోట్ల కలకలం.. విచక్షణారహితంగా దాడి

ఇంగ్లాండ్‌లో కత్తిపోట్లు కలకలం రేపాయి. బర్మింగ్‌హామ్‌ సిటీ సెంటర్‌ ప్రాంతంలో కొందరు దుండగులు స్థానికులపై విచక్షణారహితంగా కత్తిపోట్లకు పాల్పడినట్లు వెస్ట్‌ మిడ్‌లాండ్‌ పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం ఎంతమందికి ప్రాణాపాయం ఉందనే విషయాన్ని పోలీసులు వెల్లడించలేదు. ఈ దాడులకు గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే ఇది అతి పెద్ద ఘటనగా బర్మాంగ్‌హామ్ పోలీసులు వెల్లడించారు. ఇక ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు సమీపంలోని రోడ్లను మూసేసి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ ప్రాంతంలో భారీ భద్రతా ఏర్పాట్లను చేశారు. మరోవైపు ఈ దాడులు ఎందుకు జరిగాయన్న విషయంపై కారణాలను కనుగొనే పనిలో వైద్యులు పడ్డారు.

అర్ధరాత్రి 12.30 సమయంలో కొందరు పౌరులు తమకు ఫోన్ చేసి కత్తిదాడి గురించి వివరించారని, ఘటనా స్థలికి చేరుకోగానే కొద్ది సమయంలో మరిన్ని కత్తిదాడుల సమాచారం అందిందన్నారు వెస్ట్‌ మిడ్‌లాండ్‌ పోలీసులు. ప్రజల రక్షణకు చర్యలు తీసుకుంటున్నామని, ఎమర్జెన్సీ సర్వీసులనూ సమన్వయం చేసి క్షతగాత్రులకు చికిత్సకు సహకరిస్తున్నామని పోలీసులు వివరించారు. అయితే, ఎంతమంది కత్తిపోట్లకు గురయ్యారో ఇప్పుడే తేల్చలేమని పేర్కొన్నారు. ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఇంకా సమయం పడుతుందని, ప్రజలు ఈ ఏరియా నుంచి దూరంగా ఉండాలని అభ్యర్థించారు.

Next Story