మెరుగైన ఫలితాలకోసం ఎస్.ఎస్.సి మోడల్ పరీక్షలు..
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 16 Nov 2019 1:36 PM ISTహైదరాబాద్: ఎస్.ఎస్.సి మెరుగైన ఫలితాల సాధనకు డిస్ట్రిక్ట్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డ్ ప్రత్యేకంగా ప్రాక్టీస్ ఎగ్జామ్స్ విధానాన్ని ఈ ఏడాదికూడా కొనసాగించాలని నిర్ణయించింది. ఈ విధానంలో ముందుగానే సిద్ధం చేసిన మోడల్ ప్రశ్నాపత్రాలతో ప్రాక్టీస్ పరీక్షల్ని నిర్వహిస్తారు. దీనివల్ల టెన్త్ క్లాస్ విద్యార్థినీ విద్యార్థులు పరీక్షా విధానానికి, ప్రశ్నలను సమర్ధంగా ఎదుర్కోవడానికి అలవాటుపడతారు. తద్వారా ప్రధాన పరీక్ష రాసేటప్పుడు ఒత్తిడి బాగా తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు.
స్పెషల్ ప్రాక్టీస్ పరీక్షా ప్రశ్నాపత్రాలు డిసెంబర్ లో అందుబాటులోకి వస్తాయి. డిసెంబర్ 16 నుంచి మోడల్ పరీక్షల్ని నిర్వహిస్తారు. మిగతా మోడల్ ప్రాక్టీస్ పేపర్లతో 2020 జనవరి నుంచి ఫిబ్రవరి 11 వరకూ పరీక్షలు జరుగుతాయని అధికారులు తెలిపారు. మొత్తంగా ఈ ప్రాక్టీస్ ప్రశ్నాపత్రాలతో మోడల్ పరీక్షలు రెండు విడతలుగా జరుగుతాయని.. మధ్యాహ్నం 2.15 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పరీక్షలు ఉంటాయని చెప్పారు. డి.సి.ఇ.బి సెక్రటరీ పర్యవేక్షణలో బోధనా నిపుణులు ఆయా పాఠ్యాంశాల్లో ప్రాక్టీస్ పరీక్షలకోసం మోడల్ ప్రశ్నాపత్రాలను తయారు చేస్తారు.
హైదరాబాద్ జిల్లాలో ఎస్.ఎస్.సి పరీక్షల్లో మరింత మెరుగైన ఫలితాలను సాధించేందుకు డిస్ట్రిక్ట్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డ్ ఈ విధానాన్ని కిందటి సంవత్సరం ప్రవేశపెట్టింది. దీనివల్ల విద్యార్థులకు చాలా ఉపయోగం కలగడాన్నికూడా గుర్తించింది. ఈ కారణంగా ఈ సంవత్సరంకూడా విద్యార్థుల బంగారు భవితకోసం, వాళ్లు పరీక్షల్లో తడబాటు లేకుండా, ప్రశ్నల ఒరవడికి అలవాటు పడి హాయిగా పరీక్షలు రాయడంకోసం, తద్వారా మెరుగైన ఫలితాలు సాధించడంకోసం ఈ విధానాన్ని కొనసాగించాలన్న నిర్ణయం జరిగింది.
ఈ సరికొత్త విధానంవల్ల కిందటి సంవత్సరం పబ్లిక్ పరీక్షల్లో టెన్త్ క్లాస్ ఫలితాల్లో 88.9 శాతం ఉత్తీర్ణత సాధించింది. హైదరాబాద్, జగిత్యాల జిల్లాలు 99.1 శాతంతో మొదటి స్థానంలో నిలవగా, రెండవ స్థానంలో సిద్దిపేట, మూడో స్థానంలో కరీంనగర్ నిలవడం విశేషం.
2018వ సంవత్సరంలో కూడా టెన్త్ పరీక్షా ఫలితాల్లో హైదరాబాద్ చాలా వెనకబాటులోనే ఉంది. 75.98 శాతం ఫలితాలతో ఈ జిల్లా జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట, మహబూబాబాద్ జిల్లాల కంటే వెనకబడింది. ప్రాక్టీస్ పేపర్లవల్ల పిల్లలకు పరీక్షలంటే భయంపోయి, ఒత్తిడిని జయించి, మెల్లమెల్లగా టైమ్ మ్యానేజ్ మెంట్ కు, సరైన సమాధానాలను సరైన సమయంలో రాయగలిగేందుకు చక్కటి అవకాశం దొరుకుతుందన్న విషయం గడచిన సంవత్సరం ప్రాక్టికల్ గా నిరూపితమయ్యింది. డెప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కార్యాలయంనుంచి ప్రాక్టీస్ పేపర్లను తీసుకుని సరైన సమయంలో ప్రాక్టీస్ పరీక్షల్ని నిర్వహించాల్సిందిగా జిల్లా అధికారులనుంచి అన్ని పాఠశాలల హెడ్మాస్టర్లకు ఆదేశాలు అందాయి.
కచ్చితంగా పరీక్షల టైమ్ టేబుల్ పాటించాలని, సరైన సమయంలోనే పరీక్షల్ని నిర్వహించాలని, మెయిన్ ఎగ్జామ్స్ తీరులోనే ప్రాక్టీస్ పరీక్షలను పూర్తి స్థాయి క్రమశిక్షణతో నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారులనుంచి అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు స్పష్టమైన ఆదేశాలు అందాయి.