శ్రీవారి పుష్కరిణి ఘాట్ మూసివేత

By అంజి  Published on  18 March 2020 10:36 AM GMT
శ్రీవారి పుష్కరిణి ఘాట్ మూసివేత

మహమ్మారి కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు టీటీడీ అధికారులు విస్తృత చర్యలు తీసుకుంటున్నారు. శ్రీవారి ఆలయ సమీపంలోని పుష్కరిణి స్నాన ఘట్టాన్ని టీటీడీ అధికారులు మూసేశారు. అయితే భక్తులు పుష్కరిణి నీటితో స్నానమాచరించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. 18 స్నానపు గదులను ఏర్పాటు చేశామని, వాటిని వినియోగించు కోవాలని టీటీడీ అధికారులు సూచించారు. తిరుమలను తొమ్మిది విభాగాలుగా విభజించి ప్రతినిత్యం శుభ్రం చేస్తున్నారు. క్యూ కాంప్లెక్స్‌, కల్యాణకట్ట, అన్నదాన సత్రాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు మొదట తలనీలాలు సమర్పించి, ఆ తర్వాత పుష్కరిణిలో స్నానం చేసి స్వామి వారి దర్శనానికి వెళ్లడం ఆనవాయితీ.

Also Read: 276 మంది భారతీయులకు కరోనా.!

కాగా కరోనా వ్యాప్తి దృష్ట్యా టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. స్వామి వారికి సంబంధించిన సహస్ర కలాశాభిషేకం, విశేషపూజ, ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఇక కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా తిరుమలలోని జంక్షన్‌లలో శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్‌తో పాటు రేడియో బ్రాడ్‌ కాస్టింగ్ ద్వారా నిత్యం అవగాహన కల్పిస్తున్నారు. అలాగే అలిపిరి చెక్‌ పాయింట్‌, అలిపిరి నడక మార్గంలోని పాదల మండపం, శ్రీవారి మెట్టు కరోనా వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఇక్కడే భక్తులందరికీ థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు చేస్తున్నారు.

Also Read: చిలుకూరు బాలాజీ ఆలయం మూసివేత

తాజాగా గురువారం నుంచి చిలుకూరు ఆలయాన్ని కూడా మూసివేస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ వెల్లడించారు. ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకూ చిలుకూరు బాలాజీ ఆలయం మూసివేత కొనసాగుతుందని అర్చకులు తెలిపారు. అయితే..స్వామివారికి ఆరాధన, నైవేద్య కార్యక్రమాలు మాత్రం అర్చకుల సమక్షంలో నిర్వహిస్తామని తెలిపారు. భక్తులకు మాత్రం గుడికి వచ్చేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు.

Next Story
Share it