శ్రీశైలం: 4వ యూనిట్ పూర్తిగా కాలిపోయింది: జెన్‌కో సీఎండీ
By సుభాష్ Published on 26 Aug 2020 3:25 PM GMTశ్రీశైలం జల విద్యుత్ అగ్నిప్రమాదం ఘటనలో 9 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు శ్రీశైలం ప్రమాద స్థలాన్ని బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమాదం కారణంగా ప్రాణ నష్టం జరిగిందని, ఆస్తినష్టం పెద్దగా జరగలేదని అన్నారు. 4వ యూనిట్ పూర్తిగా కాలిపోయిందని, నష్టం కూడా ఎక్కువే జరిగిందని తెలిపారు. 1,2,5వ యూనిట్లు బాగానే ఉన్నాయని, 6వ యూనిట్‌లో ప్యానెల్ దెబ్బ తిన్నట్లు పేర్కొన్నారు. అయితే ఆరో యూనిట్‌లో మొదలైన మంటలు మిగతా యూనిట్లకు అంటుకున్నాయన్నారు. ప్రమాదం కారణగా వేల కోట్ల నష్టమేమి జగలేదని, దురదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరిగిందని, అదే బాధాకరమైన విషయమన్నారు.
త్వరలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభిస్తాం
త్వరలోనే విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తామని ఆయన అన్నారు. విద్యుత్ ఉద్యోగుల భద్రతకు మరిన్ని చర్యలు తీసుకుంటామని, శ్రీశైలం ప్లాంటులో జరిగిన ఘటన పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలో అన్ని చేస్తామన్నారు. ఉద్యోగులు ఎలాంటి అభద్రతా భావానికి లోను కావద్దని, మరింత అంకిత భావంతో పనిచేసి తెలంగాణ ప్రజలు తమపై పెట్టుకున్న విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలన్నారు. ఈ ప్రమాదంలో మరణించిన కుటుంబాలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వారిని ఏ విధంగా ఆదుకోవాలనే అనే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు.