శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు 40 గేట్ల ఎత్తివేత

By సుభాష్  Published on  16 Sept 2020 10:53 AM IST
శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు 40 గేట్ల ఎత్తివేత

నిజామాబాద్‌ జిల్లా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు భారీ వరద నీరు వస్తోంది. ఎగువన ఉన్నమహారాష్ట్రలో, నదీ పరివాహక ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భారీగా వరదనీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. దీంతో 40 గేట్లను ఎత్తి దిగువన వదులుతున్నారు అధికారులు. ఇప్పటికే నిండుకుండలా కళకళలాడుతున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరడంతో గేట్లను వదిలారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్‌ప్లో 2,21,013 క్యూసెక్కుల వరదనీరు వస్తోంది. దీంతో దిగువకు అంతే స్థాయి నీటిని వదులుతున్నారు.

ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 1,091 అడుగులు కాగా, పూర్తిస్థాయిలో నిండి ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 90.31 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 90.31 టీఎంసీలు ఉంది. జలాశయం గరిష్ట మట్టానికి చేరుకోవడంతో అధికారులు 40 గేట్లను దిగువన వదులుతున్నారు. ఒక్కసారిగా 40 గేట్లను వదలడంతో నీటిని చూసేందుకు ప్రజలు భారీ ఎత్తున తరలివస్తున్నారు. అలాగే కాకతీయ కాలువ ద్వారా మానేరుకు, వరద కాలువ ద్వారా మిడ్‌ మనేరుకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే మధ్య మానేరుకు ఎగువ నుంచి వరదనీరు వస్తుండటంతో మంగళవారం కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ గేట్లు ఎత్తి లోయన్‌ మానేరు డ్యామ్‌కు వదిలారు.

Next Story