పాఠశాలలు తెరిచేందుకు మరింత సమయం పడుతుంది: మంత్రి సబితా
By సుభాష్ Published on 15 Sep 2020 8:04 AM GMTకరోనా మహమ్మారి కారణంగా దేశంలో పాఠశాలలన్నీ మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది విద్యాసంస్థలు తెరిచేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిబంధనల మేరకు పాఠశాలలు తెరుస్తామని స్పష్టం చేశారు. విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్ చొరవతో ఆన్‌లైన్ క్లాసులు కొనసాగిస్తున్నామని అన్నారు. కాగా, పాఠశాలలు ప్రారంభం, ఆన్‌లైన్ క్లాసుల నిర్వహణపై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సబితా సమాధానం ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కోవిడ్ ప్రభావంతో విద్యాసంస్థలు మూతపడ్డాయని, విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మార్చి 16 నుంచి పాఠశాలలను వేసివేయడం జరిగిందన్నారు. లాక్‌డౌన్ సమయంలో పరీక్షల నిర్వహణపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో అన్ని తరగతుల విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేశామన్నారు. అలాగే విద్యార్థులందరికీ ఉచితంగా పుస్తకాలు అందజేస్తున్నామని అన్నారు.
ఆన్‌లైన్ క్లాసుల నిర్వహణపై ముందస్తుగా విద్యాశాఖ తరపున మూడు రకాల సర్వే చేశామని, రాష్ట్రంలో 85 శాతం మంది విద్యార్థులకు టీవీ టీవీలు అందుబాటులో ఉన్నట్లు తేలిందన్నారు. అలాగే 40 శాతం విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు కూడా ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. ఇక టీవీ, స్మార్ట్ ఫోన్లు లేనివారిని పక్కవారితో అనుసంధానం చేశామని, విద్యార్థుల ఫీడ్ బ్యాక్ కోసం వర్క్ షీట్స్ తయారు చేశామని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం విద్యార్థులందరికీ ఆన్‌లైన్ క్లాసులు సౌకర్యవంతంగా ఉందని తెలిపారు. అలాగే అత్యధికంగా ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ ఇప్పటికే హెచ్చరించారని అన్నారు.