ట్రయల్స్‌కు కాస్త టైమ్ కావాలి

By అంజి  Published on  18 Feb 2020 3:26 AM GMT
ట్రయల్స్‌కు కాస్త టైమ్ కావాలి

జమైకా పరుగుల వీరుడు ఉసేన్‌ బోల్ట్‌ రికార్డును తలదన్నెలా కంబళ పోటీల్లో పరుగులు తీసి సంచలనం సృష్టించిన శ్రీనివాస గౌడ పేరు దేశంలో మార్మోగిపోతోంది.

100 మీటర్ల దూరాన్ని శ్రీనివాస గౌడ కేవలం 9.55 సెకన్లలోనే అధిగమించడమే అందుకు కారణం. పరుగుల చిరుతగా పేరుగాంచిన ఉసేన్ బోల్ట్ సాధించిన వరల్డ్ రికార్డ్ టైమింగ్ 9.58 సెకన్లు కాగా, గౌడ 0.3 సెకన్ల తేడాతో బోల్ట్ ను అధిగమించాడు.

Srinivasa gowda running trials

శ్రీనివాస గౌడ స్పీడ్ చూసిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కోచ్ లు సైతం తీవ్ర ఆశ్చర్యానికి గురయ్యారు. కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజు దిగ్భ్రాంతి చెందారు. సంప్రదాయ పోటీల్లో పాల్గొనే ఓ యువకుడు జారిపోయే బురదలో సైతం చిరుతలా పరిగెత్తడం తనను విస్మయానికి గురిచేసింది అన్నారు. అంతేకాదు శ్రీనివాస గౌడకు ట్రయల్స్ నిర్వహించాల్సిందిగా సాయ్ కోచ్ లను ఆదేశించారు. అయితే, తనకు నెల సమయం కావాలని గౌడ తెలిపాడు. ప్రస్తుతం కంబళ టోర్నమెంట్ జరుగుతోందని, అక్కడ మరిన్ని విజయాలు సాధించాలనుకుంటున్నానని తెలిపాడు.

Srinivasa gowda running trials

అయితే.. రన్నింగ్ ట్రాక్ కు, కంబళ ట్రాక్ కు చాలా తేడా ఉంటుందని, రన్నింగ్ ట్రాక్ లో వేళ్లమీద పరిగెడితే, బురదతో నిండిన కంబళ ట్రాక్ లో జారిపోకుండా మడమలపై పరిగెడతామని వివరించాడు. తనకు అంత పేరు తెచ్చిన పరుగులో వాస్తవానికి దున్నపోతులదే కీలకపాత్ర అని వినమ్రంగా వెల్లడించాడు. ఉసేన్ బోల్ట్ తో తనను పోల్చడంపైనా శ్రీనివాస గౌడ స్పందించాడు. బోల్ట్ ప్రపంచ విజేత అని, తాను పంటపొలాల్లో, బురద నేలల్లో పరిగెత్తే వ్యక్తినని పేర్కొన్నాడు.

28 ఏళ్ల ఈ కన్నడ జాకీ.. కంబళ రేసును 13.62 సెకన్లలో పూర్తి చేశాడు. అందులో అతను 100 మీటర్ల పరుగును 9.55 సెకన్లలోనే అందుకోవడంతో పెను సంచలనం రేగింది. అయితే సాధారణంగా ఒక దానిలో రాణించేవారు మరో దానిలో అంతగా సత్తాచాటలేరు. ట్రాక్స్‌ ఈవెంట్స్‌లో రాణించిన ఎంతో మంది సంప్రదాయ క్రీడల్లో విజయవంతం కాలేకపోయారు. మరోవైపు శ్రీనివాస గౌడను కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప సోమవారం అభినందించారు. ఆయన కార్యాలయానికి పిలిపించి గౌడను శాలువాతో సత్కరించి రూ.3 లక్షల నగదు బహుమతిని అందించారు.

Srinivasa gowda running trials

Next Story