యువ సంచ‌ల‌నం.. సచిన్-కోహ్లీల కంటే ముందుగానే ఆ ఇన్నింగ్స్ ఆడేశాడు..!

ఐర్లాండ్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే యువ ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు.

By Medi Samrat  Published on  15 Feb 2025 11:35 AM IST
యువ సంచ‌ల‌నం.. సచిన్-కోహ్లీల కంటే ముందుగానే ఆ ఇన్నింగ్స్ ఆడేశాడు..!

ఐర్లాండ్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే యువ ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. బ్రియాన్ బెన్నెట్ వన్డే ఫార్మాట్‌లో 150 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన అతి పిన్న వయస్కుడైన జింబాబ్వే బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. హరారేలో జరిగిన మ్యాచ్‌లో బెన్నెట్ 163 బంతుల్లో 20 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 169 పరుగులు చేశాడు.

బెన్నెట్ 21 సంవత్సరాల 96 రోజుల వయస్సులో ODIలో 150 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేశాడు. త‌ద్వారా అత‌డు భారత సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ, లెజెండ‌రీ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్‌ల రికార్డును అధిగ‌మించాడు. కోహ్లీ 23 ఏళ్ల 134 రోజుల వయసులో వన్డేల్లో తొలిసారి 150 పరుగుల మార్క్‌ను దాటాడు. సచిన్ టెండూల్కర్ 26 ఏళ్ల 198 రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు.

క్రికెట్ చరిత్రలో బ్రియాన్ బెన్నెట్ వన్డే ఇన్నింగ్స్‌లో 150 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన నాల్గవ పిన్న వయస్కుడైన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. 2010లో కెనడాపై 177 పరుగుల ఇన్నింగ్స్ ఆడిన ఐర్లాండ్ ఆటగాడు పాల్ స్టిర్లింగ్ పేరిట ఈ ప్రపంచ రికార్డు ఉంది. ఆ సమయంలో స్టెర్లింగ్ వయస్సు 20 సంవత్సరాల నాలుగు రోజులు మాత్రమే. బంగ్లాదేశ్‌కు చెందిన తమీమ్ ఇక్బాల్, ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన ఇబ్రహీం జద్రాన్‌లు రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.

వన్డే చరిత్రలో 150+ పరుగులు చేసిన అతి పిన్న వయస్కుడు

20 సంవత్సరాల 4 రోజులు - పాల్ స్టిర్లింగ్ (ఐర్లాండ్), 2010

20 సంవత్సరాల 149 రోజులు - తమీమ్ ఇక్బాల్ (బంగ్లాదేశ్), 2009

20 సంవత్సరాల 353 రోజులు - ఇబ్రహీం జద్రాన్ (ఆఫ్ఘనిస్తాన్), 2009

21 సంవత్సరాల 96 రోజులు - బ్రియాన్ బెన్నెట్ (జింబాబ్వే), 2025

బ్రియాన్ బెన్నెట్ 169 పరుగుల ఇన్నింగ్స్ ఆడి తన ఖాతాలో మరో ఘనతను చేర్చుకున్నాడు. జింబాబ్వే తరఫున బెన్నెట్ వన్డే ఇన్నింగ్స్‌లో ఐదవ అత్యధిక వ్యక్తిగత స్కోరు చేశాడు. జింబాబ్వే తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రికార్డు చార్లెస్ కోవెంట్రీ పేరిట ఉంది. 2009లో బులవాయోలో బంగ్లాదేశ్‌పై కోవెంట్రీ 194* పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. 2009లో కెన్యాపై 178* పరుగుల ఇన్నింగ్స్ ఆడిన హామిల్టన్ మసకద్జా ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు.

Next Story