ఐపీఎల్‌లో జింబాబ్వే పేస‌ర్‌.. ఆ జ‌ట్టులో ఆడ‌నున్నాడు..!

Zimbabwean Pacer Blessing Muzarabani Set To Join Lucknow Super Giants.జింబాబ్వే పేస్ బౌల‌ర్ బ్లెస్సింగ్ ముజారబానీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 March 2022 7:55 AM GMT
ఐపీఎల్‌లో జింబాబ్వే పేస‌ర్‌.. ఆ జ‌ట్టులో ఆడ‌నున్నాడు..!

జింబాబ్వే పేస్ బౌల‌ర్ బ్లెస్సింగ్ ముజారబానీ బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేశాడు. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌)2022లో ఆడే అవ‌కాశాన్ని అందుకున్నాడు. ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ మెగా వేలంలో భారీ ధ‌ర వెచ్చించి కొనుగోలు చేసిన ఇంగ్లాండ్ ఆల్‌రౌండ‌ర్ మార్క్‌వుడ్ గాయంతో ఈ సీజ‌న్‌కు దూరం అయిన సంగ‌తి తెలిసిందే. అత‌డి స్థానాన్ని బంగ్లాదేశ్‌ పేసర్‌ టాస్కిన్‌ ఆహ్మద్‌తో భర్తీ చేయాలని ల‌క్నో జ‌ట్టు యాజ‌మాన్యం బావించింది.

అయితే.. టాస్కిన్‌ ఆహ్మద్ ప్ర‌స్తుతం ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న బంగ్లాదేశ్ జ‌ట్టులో ఉన్నాడు. ఈ నేప‌థ్యంలో అత‌డు ఐపీఎల్‌లో ఆడేందుకు బంగ్లా క్రికెట్ బోర్డు అనుమ‌తి నిరాక‌రించింది. దీంతో ఆ అదృష్టం జింబాబ్వే పేస్ బౌల‌ర్ బ్లెస్సింగ్ ముజారబానీకి ద‌క్కింది. అత‌డు ఇప్ప‌టికే భార‌త్ బ‌య‌లుదేరిన‌ట్లు జింబాబ్వేలోని భార‌త రాయ‌బారి కార్యాల‌యం ధ్రువీక‌రించింది. అయితే.. అత‌డు తుది జ‌ట్టులో ఆట‌గాడిగా ఉంటాడా..? లేక నెట్ బౌల‌ర్‌గా సేవ‌లందిస్తాడా..? అన్న‌ది ఇంకా తెలియాల్సి ఉంది.

ఇండియ‌న్ ప్రీమియర్ లీగ్ మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. 65 రోజుల పాటు 70 మ్యాచులు క్రికెట్ అభిమానుల‌ను అల‌రించ‌నున్నాయి. కాగా.. ప్లే ఆఫ్‌ మ్యాచులు మినహా, లీగ్‌ మ్యాచ్‌ల షెడ్యూల్స్, వేదిలకను భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) వెల్ల‌డించింది. ఇక లక్నో సూపర్ జెయింట్స్‌ తన తొలి మ్యాచ్‌ మార్చి 28న‌ మరో కొత్త జట్టు గుజరాత్‌ టైటాన్స్ ఆడ‌నుంది.

Next Story