ఇంగ్లండ్‌లో చాహల్ విధ్వంసం
ఇంగ్లండ్ దేశవాళీ క్రికెట్‌లో లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తన అద్భుత ప్రదర్శనను కొనసాగించాడు
By Medi Samrat Published on 10 Sep 2024 2:48 PM GMTఇంగ్లండ్ దేశవాళీ క్రికెట్‌లో లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తన అద్భుత ప్రదర్శనను కొనసాగించాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్ ప్రస్తుత సీజన్‌లో చాహల్ తన తొలి ఐదు వికెట్లు సాధించాడు. డెర్బీషైర్‌తో నార్తాంప్టన్‌షైర్‌కు ఆడుతున్న సమయంలో చాహల్ ఈ ఫీట్ చేశాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో చాహల్ ఐదు వికెట్లు తీయడం ఇది మూడోసారి. యుజ్వేంద్ర చాహల్ 45 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. చాహల్ అద్భుత బౌలింగ్‌తో నార్తాంప్టన్‌షైర్ తొలి ఇన్నింగ్స్‌లో 54 పరుగుల ఆధిక్యం సాధించింది. కౌంటీ ఛాంపియన్‌షిప్ డివిజన్ 2 మ్యాచ్‌లో రెండో రోజు ఒక దశలో డెర్బీషైర్ 4 వికెట్ల నష్టానికి 150 పరుగులతో ఉంది. అయితే కేవలం 15 పరుగులకే చివరి ఆరు వికెట్లను కోల్పోయింది.
భారత్ తరఫున చాహల్ ఇంకా టెస్టు మ్యాచ్‌లు ఆడలేదు. కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో రెడ్ బాల్ క్రికెట్ ఆడడం ద్వారా యుజ్వేంద్ర చాహల్ ఈ ఫార్మాట్‌లో తనను తాను నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అక్టోబర్ 11 నుంచి ప్రారంభం కానున్న రంజీ ట్రోఫీ సీజన్‌లో చాహల్ హర్యానా తరఫున ఆడే అవకాశం ఉంది. చాహల్ చివరిసారిగా టీ20 ప్రపంచకప్ 2024లో బంగ్లాదేశ్‌తో న్యూయార్క్‌లో భారత్ తరఫున ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాడు.