టీమ్ఇండియాలో మ‌రోసారి క‌రోనా క‌ల‌క‌లం.. ఇద్ద‌రు ఆట‌గాళ్లకు పాజిటివ్‌

Yuzvendra Chahal and Krishnappa Gawtham tests covid-19 positive.అస‌లే ఓట‌మి బాధ‌లో ఉన్న టీమ్ఇండియాకు మ‌రో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 July 2021 1:26 PM IST
టీమ్ఇండియాలో మ‌రోసారి క‌రోనా క‌ల‌క‌లం.. ఇద్ద‌రు ఆట‌గాళ్లకు పాజిటివ్‌

అస‌లే ఓట‌మి బాధ‌లో ఉన్న టీమ్ఇండియాకు మ‌రో షాక్ త‌గిలింది. తాజాగా భార‌త జ‌ట్టులో మ‌రోసారి క‌రోనా క‌ల‌క‌లం రేపుతోంది. ఇప్ప‌టికే ఆల్‌రౌండ‌ర్ కృనాల్ పాండ్యాకు క‌రోనా సోక‌గా.. తాజాగా స్పిన్న‌ర్ య‌జ్వేంద్ర చహల్‌, ఆల్‌రౌండ‌ర్ కృష్ణ‌ప్ప గౌత‌మ్ క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని బీసీసీఐ వ‌ర్గాలు ధృవీక‌రించాయి. చహల్, గౌతమ్‌లు కృనాల్ పాండ్యాతో సన్నిహితంగా ఉన్న విషయం తెలిసిందే.

కృనాల్ పాండ్యాకి గత మంగళవారం కరోనా పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. అతనితో క్లోజ్‌ కాంటాక్ట్‌లో ఉన్న ఎనిమిది మంది ఆటగాళ్లను బీసీసీఐ ఐసోలేషన్‌కి తరలించిందిరు. సోమవారం రాత్రి కృనాల్ పాండ్యాతో కలిసి ఈ ఎనిమిది మంది భోజనం చేసినట్లు అక్కడి బీసీసీఐ అధికారులు గుర్తించారు. దాంతో మంగళవారమే ఆ 8 మందికి ఆర్‌టీ-పీసీఆర్ టెస్టులు నిర్వహించగా.. అందరికీ నెగటివ్ వచ్చింది. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బుధవారం, గురువారం జరిగిన రెండు టీ20 మ్యాచ్‌లకీ ఆ 8 మందిని దూరంగా పెట్టారు.

ఎనిమిది మందిలో యుజ్వేంద్ర చహల్, కృష్ణప్ప గౌతమ్‌లు కూడా ఉన్నారు. తాజాగా నిర్వహించిన ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షల్లో చహల్, గౌతమ్‌లకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. కాగా ఇప్పటికే చహల్‌ క్వారంటైన్‌లో​ ఉండగా.. తాజాగా గౌతమ్‌ను కూడా ఐసోలేషన్‌కు పంపించారు. వీరిద్దరూ కొలంబోలోని మౌంట్ లావినియా హోటల్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ఇద్దరికీ స్వల్ప లక్షణాలే ఉన్నట్టు సమాచారం. బీసీసీఐ వైద్య బృందం వారిని పర్యవేక్షిస్తోంది. ఈ ఇద్దరు కరోనా బారీన పడడంతో మరోసారి ఆటగాళ్లకు ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటికే టీ20 సిరీస్‌ ఓటమితో బాధలో ఉన్న భారత జట్టుకు ఇది భారీ షాక్‌ అనే చెప్పాలి.

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌)కు ఇంకా సమయం ఉండడంతో ఆటగాళ్లంతా ప్రస్తుతం కొద్దిరోజులు లంకలోనే ఉండనున్నారు. ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షల అనంతరం నెగెటివ్‌ వచ్చిన ఆటగాళ్లను స్వదేశానికి పంపించి.. పాజిటివ్‌ వచ్చిన ఆటగాళ్లను లంకలోనే ఉంచనున్నారు. ఇక ఐపీఎల్‌ 14వ సీజన్‌ యూఏఈ వేదికగా సెప్టెంబర్‌ 19 నుంచి మొదలుకానుంది.

Next Story