ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌.. యువీ రీ ఎంట్రీ

Yuvraj Singh named in Punjab's 30-man probables' list for Syed Mushtaq Ali Trophy. టీమ్ఇండియా మాజీ ఆల్‌రౌండ‌ర్‌,

By Medi Samrat  Published on  16 Dec 2020 10:38 AM IST
ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌.. యువీ రీ ఎంట్రీ

టీమ్ఇండియా మాజీ ఆల్‌రౌండ‌ర్‌, ప్ర‌పంచ‌క‌ప్‌ల హీరో యువ‌రాజ్ అభిమానుల‌కు నిజంగా శుభ‌వార్త ఇది. యువ‌రాజ్ తిరిగి మైదానంలో అడుగుపెట్ట‌బోతున్నాడు. ముస్తాక్ అలీ ట్రోఫీ కోసం పంజాబ్ ఎంపిక చేసిన ప్రాబ‌బుల్స్ జాబితాలో యువీ పేరు ఉండ‌టం అభిమానుల్లో ఆనందాన్ని నింపుతుంది. ఈ టోర్నీ కోసం 30 మందితో ప్రాబబుల్స్ జాబితాను ప్ర‌క‌టించారు. యువీ ఇప్ప‌టికే మొహాలీలోని ఐఎస్ బింద్రా పంజాబ్ క్రికెట్ అసోసియేష‌న్ స్టేడియంలో నెట్ ప్రాక్టీస్ కూడా చేస్తుండటం విశేషం.

గతేడాది జూన్‌లో యువీ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ.. 'పంజాబ్‌ క్రికెట్ అసోసియేషన్‌' కార్యదర్మి పునీత్‌ సంప్రదించడంతో తన సొంత రాష్ట్రం కోసం తిరిగి ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఇటీవ‌ల 40వ వ‌సంతంలోకి అడుగుపెట్టిన యువీ ప‌రోక్షంగా ఈ విష‌యాన్ని వెల్ల‌డించాడు. ఈ ఏడాది కొత్త‌గా ప్రారంభిస్తున్నాన‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను అభిమానుల‌తో పంచుకున్నాడు. కాగా.. ఆ వీడియోలో యువ‌రాజ్ బ్యాటింగ్ సాధ‌న చేస్తున్నాడు.

బీసీసీఐ నిబంధ‌న‌ల ప్ర‌కారం యాక్టివ్ ప్లేయ‌ర్స్‌కు విదేశీ టీ20 లీగ్‌ల‌లో ఆడేందుకు అనుమ‌తి ఉండ‌దు. అయితే యువీ రిటైర్మెంట్ తర్వాత కెన‌డాలో జ‌రిగిన గ్లోబ‌ల్ టీ20 లీగ్ స‌హా ప‌లు విదేశీ లీగ్స్‌లో ఆడుతున్నాడు. అయితే పీసీఏ సెక్ర‌ట‌రీ పునీత్ బాలి విజ్ఞ‌ప్తి మేర‌కు త‌న రిటైర్మెంట్‌పై పున‌రాలోచ‌న చేస్తున్న యువ‌రాజ్.. అందుకు అనుమ‌తి ఇవ్వాలంటూ బీసీసీఐ అధ్యక్షుడు సౌర‌వ్ గంగూలీ, కార్య‌ద‌ర్శి జే షాను కోరాడు.

యువీతో పాటు పేస‌ర్ శ్రీశాంత్ కూడా తిరిగి మైదానంలో అడుగుపెట్ట‌నున్నాడు. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ ఆరోప‌ణ‌ల‌తో అత‌డిపై బీసీసీఐ నిషేదం విధించిన సంగ‌తి తెలిసిందే. అయితే.. ఈ ఏడాది సెప్టెంబ‌ర్‌తో అత‌డిపై ఉన్న నిషేదం తొల‌గిపోయింది. అనంత‌రం పోటి క్రికెట్ ఆడాల‌ని సాధ‌న మొద‌లు పెట్టిన‌ట్లు శ్రీశాంత్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కేర‌ళ జ‌ట్టు ఆట‌గాళ్ల ప్రాబ‌బుల్ జాబితాలో చోటు ద‌క్కించుకున్నాడు. ఈ జ‌ట్టులో సంజుశాంస‌న్‌, రాబిన్ ఉత‌ప్ప కూడా ఉన్నారు. పిబ్ర‌వ‌రిలో ఐపీఎల్ వేలం నిర్వ‌హించ‌నున్నార‌ని వార్త‌లు వ‌స్తుండ‌డంతో అంద‌రి చూపు ఈ దేశ‌వాలీ టోర్నీపై ఉంది.




Next Story