సంతోషంలో తేలిపోతున్న యువరాజ్ సింగ్
Yuvraj Singh - Hazel Keech welcome their first child.టీమ్ఇండియా మాజీ ఆటగాడు, ప్రపంచకప్ హీరో యువరాజ్ సింగ్ ఇంట
By తోట వంశీ కుమార్ Published on 26 Jan 2022 9:02 AM ISTటీమ్ఇండియా మాజీ ఆటగాడు, ప్రపంచకప్ హీరో యువరాజ్ సింగ్ ఇంట సంతోషం వెళ్లివిరిసింది. యువరాజ్ సింగ్ సతీమణి హేజల్ కీచ్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని యువరాజ్ సింగ్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. అభిమానులు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఈ విషయాన్ని పంచుకోవడం ఆనందంగా ఉందని యువరాజ్ చెప్పుకొచ్చాడు. దేవుడికి ధన్యవాదాలు తెలిపాడు. ఇక తమ ప్రైవసీకి ఎటువంటి భంగం కలిగించవద్దని విజ్ఞప్తి చేశాడు.
'మాకు పండంటి మగ బిడ్డ జన్మించాడు. ఈ విషయాన్ని అభిమానులు, స్నేహితులు, కుటుంబ సభ్యులకు తెలియజేయడం చాలా సంతోషంగా ఉంది. దేవుడికి కృతజ్ఞతలు. ఈ సందర్భంగా మా గోపత్యకు(ప్రైవసీ)కి ఎటువంటి భంగం కలిగించకూడదని కోరుకుంటున్నాం' అని యువీ ట్వీట్ చేశాడు.
❤️ @hazelkeech pic.twitter.com/IK6BnOgfBe
— Yuvraj Singh (@YUVSTRONG12) January 25, 2022
ఇదే పోస్టును యువీ భార్య హెజల్ కీచ్ కూడా పోస్టు చేసింది. విషయం తెలిసిన పలువురు క్రికెటర్లు, అభిమానులు యువరాజ్‌కు అభినందనలు తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు.
2000 సంవత్సరంలో కెన్యాతో జరిగిన మ్యాచ్ ద్వారా యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో సత్తా చాటి ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. టీమ్ఇండియాకు ఎన్నో మరుపురాని విజయాలను అందించాడు. టీమ్ఇండియా తరుపున 304 వన్డేలు, 40 టెస్టులు, 58 టీ20లకు ప్రాతినిధ్యం వహించిన యువీ వరుసగా.. వన్డేల్లో 8,701, టెస్టుల్లో 1900, టీ 20ల్లో 1177 పరుగులు చేశాడు. భారత జట్టు 2007 టీ 20, 2011 వన్డే ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 2019లో అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించాడు. బ్రిటిష్-మారిషయస్ నటి మోడల్ అయిన హేజల్ కీచ్‌ను 2016లో యువీ వివాహం చేసుకున్నాడు.