'తక్కువ ఆడుతాడు.. ఎక్కువ మాట్లాడుతాడు' బాబర్ ఆజంపై నిప్పులు చెరిగిన మాజీ కెప్టెన్

స్టార్ బ్యాట్స్‌మెన్ బాబర్ ఆజంపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ యూనిస్ ఖాన్ తీవ్ర విమర్శలు చేశాడు

By Medi Samrat  Published on  16 Sept 2024 11:08 AM IST
తక్కువ ఆడుతాడు.. ఎక్కువ మాట్లాడుతాడు బాబర్ ఆజంపై నిప్పులు చెరిగిన మాజీ కెప్టెన్

స్టార్ బ్యాట్స్‌మెన్ బాబర్ ఆజంపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ యూనిస్ ఖాన్ తీవ్ర విమర్శలు చేశాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో 0-2 తేడాతో ఓడిపోయింది. ఈ టెస్టు సిరీస్‌లో పాకిస్థాన్ జట్టు పేలవ ప్రదర్శన చేసింది. దీంతో పాకిస్థాన్ జట్టు మాజీ కెప్టెన్ యూనిస్ ఖాన్ బాబర్ ఆజంపై ఫైర్ అయ్యాడు. విరాట్ కోహ్లీని చూసి నేర్చుకోవాలని యూనిస్ బాబర్‌కు సూచించాడు.

బాబర్ ఆజం ప్రస్తుత ఫామ్ దారుణంగా ఉంది. గత 16 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో అతడు ఒక్క‌ హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. దీనిపై యూనిస్.. బాబర్ ఆజంపై తన కోపాన్ని బయటపెట్టాడు. బాబర్, ఇతర టాప్ ప్లేయర్‌లు మైదానంలో బాగా రాణిస్తే ఫలితాలు అందరికీ స్పష్టంగా కనిపిస్తాయన్నాడు.

కరాచీ ప్రీమియర్ లీగ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో.. యూనిస్ ఖాన్ బాబర్ ఆజంపై విమర్శలు చేశాడు. బాబర్‌కు జట్టు కెప్టెన్సీ ఇచ్చినప్పుడు.. అతడు ఆ సమయంలో మా అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ అని యూనిస్ చెప్పాడు. అతడిని కెప్టెన్‌గా చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు నేను కూడా అక్కడే ఉన్నాను కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది కాబట్టి ఈ విషయం ఆయనే ఆలోచించాలన్నారు.

బాబర్ చాలా చిన్న వయస్సులో చాలా సాధించాడని.. , అయితే భవిష్యత్తులో అతడు ఏమి సాధించాలో ఇప్పుడు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. దేశం తరఫున మళ్లీ ఆడే అవకాశం రాకపోవచ్చని అత‌డు ఎప్పుడూ గుర్తుంచుకోవాలని హెచ్చ‌రించాడు.

విరాట్ కోహ్లీని చూడు.. అతడే కెప్టెన్సీని విడిచిపెట్టాడు.. ఇప్పుడు అతని బ్యాటింగ్ పూర్తిగా భిన్నమైన స్థాయిలో కనిపిస్తోందని..అతడు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాడని యూనిస్ అన్నాడు. ఆటగాడికి మొదటి ప్రాధాన్యత ఎప్పుడూ దేశం కోసం ఆడటమే తప్ప.. కెప్టెన్సీకి కాదని ఇది మనకు తెలియజేస్తోందని ఉద‌హ‌రించాడు.

Next Story