'రోహిత్ అలాంటి ఆటగాడు..' హార్దిక్ కితాబు
ముంబై ఇండియన్స్ సొంత మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్‌ను 9 వికెట్ల తేడాతో ఓడించి మునుపటి ఓటమిని సమం చేసింది.
By Medi Samrat
ముంబై ఇండియన్స్ సొంత మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్‌ను 9 వికెట్ల తేడాతో ఓడించి మునుపటి ఓటమిని సమం చేసింది. CSKతో మ్యాచ్‌లో రోహిత్ శర్మ 76 పరుగులతో అజేయంగా ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి సూర్యకుమార్ యాదవ్ మద్దతుగా నిలిచాడు, అతను అజేయంగా 68 పరుగులు చేశాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. CSK తరపున జడేజా, దూబే అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం ముంబై 15.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. మ్యాచ్‌లో విజయం తర్వాత ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఏం చెప్పాడో తెలుసుకుందాం..
ఇలాంటి విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉన్నామని విజయం అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. హార్దిక్ కూడా మాట్లాడుతూ.. “ఈ రోజు మేము ఆడిన తీరు మాకు చాలా సానుకూలమైన విషయం. రోహిత్, స్కై (సూర్యకుమార్ యాదవ్) బాగా బ్యాటింగ్ చేశారు. మా బౌలర్లు కూడా బాగా బౌలింగ్ చేశారు. మా ప్లాన్ ప్రకారం ఆడుతున్నామన్నాడు. రిథమ్‌లో ఉన్న ప్రత్యర్థి జట్టు చేతుల్లోంచి మ్యాచ్‌ను లాక్కొని తనంతట తానుగా విజయానికి బాట వేసే ఆటగాడు రోహిత్ శర్మ అని కితాబిచ్చాడు.
ఐపీఎల్ 2025లో నిరాశపరిచిన రోహిత్ శర్మ అంతకుముందు ఆరు ఇన్నింగ్స్‌ల్లో 82 పరుగులు మాత్రమే చేశాడు. ఆదివారం అతను తన సొంత మైదానం వాంఖడే స్టేడియంలో ఆడిన తుఫాను ఇన్నింగ్స్‌లో ఆరు సిక్సర్లు, నాలుగు ఫోర్లు కొట్టి ఒకప్పటి హిట్ మ్యాన్‌ను గుర్తుచేశాడు. దాదాపు 168 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. ఏడాది తర్వాత ఐపిఎల్‌లో అతని బ్యాట్ నుండి అలాంటి ఇన్నింగ్స్ కనిపించింది. రోహిత్ గత ఏడాది IPLలో లక్నో సూపర్‌జెయింట్స్‌పై 38 బంతుల్లో 68 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడి చివరి అర్ధ సెంచరీని సాధించాడు.