స్టార్ క్రికెట‌ర్‌గా ఎదిగేందుకు కార‌ణ‌మైన జ‌ట్టునే వ‌దిలి వెళ్తున్నాడు..!

ముంబై జట్టు ఓపెనర్ యశస్వి జైస్వాల్ మంగళవారం ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు మెయిల్ రాశారు.

By Medi Samrat
Published on : 2 April 2025 10:46 AM

స్టార్ క్రికెట‌ర్‌గా ఎదిగేందుకు కార‌ణ‌మైన జ‌ట్టునే వ‌దిలి వెళ్తున్నాడు..!

ముంబై జట్టు ఓపెనర్ యశస్వి జైస్వాల్ మంగళవారం ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు మెయిల్ రాశారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం.. యశస్వి జైస్వాల్ త్వరలో ముంబై జట్టును వదిలి గోవా జట్టులో చేరబోతున్నాడు. ఈ వార్తతో క్రికెట్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. 23 ఏళ్ల యశస్వి ముంబై జట్టు తరఫున ఆడడం ద్వారా భారత క్రికెట్ జట్టులోకి ప్రవేశించాడు. అయితే.. యశస్వి జైస్వాల్ వచ్చే సీజన్‌లో గోవా కెప్టెన్‌గా మారే అవకాశం ఉంది. కెప్టెన్సీ కారణంగానే యశస్వీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

యశస్వి ముంబై క్రికెట్ అసోసియేషన్ నుండి నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) కోసం దరఖాస్తు చేసుకున్నారని.. గోవాకు మారడానికి గల కారణం వ్యక్తిగతంగా పేర్కొన్న‌ట్లు MCA మూలాలు తెలిపాయి. 23 ఏళ్ల యశస్వికి ఇది చాలా పెద్ద అడుగు. ముఖ్యంగా గోవా జట్టు నాకౌట్‌కు అర్హత సాధించింది.

గ్రేట్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్, సిద్ధేష్ లాడ్‌లు కూడా దేశవాళీ క్రికెట్‌లో గోవా జట్టుకు ఆడుతున్నారు. వారి దారిలోనే ఇప్పుడు యశస్వి కూడా జ‌ట్టు మార‌నున్నాడు.

యశస్వి తీసుకున్న నిర్ణ‌యం అతనికి దేశవాళీ క్రికెట్‌లో తన ప్రతిభను మరింత మెరుగుపరుచుకునే అవకాశాన్ని ఇస్తుందని అంటున్నారు విశ్లేష‌కులు. యశస్వి గత సీజన్‌లో ముంబై తరఫున ఆడాడు. జమ్మూ & కాశ్మీర్‌తో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ముంబై తరపున అతను రెండు ఇన్నింగ్స్‌లలో వరుసగా 4, 26 పరుగులు చేశాడు.

ఈ ఏడాది ప్రారంభంలో ఛాంపియన్స్ ట్రోఫీ జ‌ట్టులోకి ఎంపిక కాని యశస్విని.. కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా ఉంచారు. కొన్ని సీజన్ల క్రితం యశస్వి కూడా ముంబైకి ఆడుతూ విజయ్ హజారే ట్రోఫీలో డబుల్ సెంచరీ సాధించాడు. దేశవాళీ క్రికెట్‌లో అతడి బలమైన ప్రదర్శన కారణంగా య‌శ‌స్వి రెండేళ్ల క్రితం భారత జట్టులో చోటు సంపాదించాడు. ఆ తర్వాత అతను వెనుదిరిగి చూడలేదు.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో యశస్వి ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీల సహాయంతో ఐదు మ్యాచ్‌లలో 43 సగటుతో 391 పరుగులు చేశాడు. అయితే IPL 2025లో అతని ప్రదర్శన అంతగా లేదు. రాజస్థాన్ తరఫున మూడు మ్యాచ్‌లు ఆడి 34 పరుగులు మాత్రమే చేశాడు. అతని సగటు 11 కాగా స్ట్రైక్ రేట్ 106.

Next Story