ధోనీని ఆదర్శంగా తీసుకుని బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెడుతున్న బౌల‌ర్‌.!

భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన‌ అవసరం లేదు.

By Medi Samrat  Published on  11 March 2024 4:50 PM IST
ధోనీని ఆదర్శంగా తీసుకుని బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెడుతున్న బౌల‌ర్‌.!

భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన‌ అవసరం లేదు. చిన్న మైదానం నుంచి కెరీర్‌ ప్రారంభించి, ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు కావాలనే కోరికతో మహీ క్రికెటర్‌గా ఎలా ప్రతి ఒక్కరి మనసును గెలుచుకున్నాడో ప్ర‌తీ ఒక్క‌రికి తెలుసు.. ఈ స్థాయికి రావాడానికి అతను పడిన కష్టాల కథ ప్రపంచం మొత్తానికి తెలుసు. నేటికీ చాలా మంది వీధి స్థాయి క్రికెటర్లు ధోనీలా మారాలని కలలు కంటున్నారు.

కొందరు అతనిని తమ గురువుగా భావిస్తారు. మరికొందరు అతని చిట్కాలను అనుసరించి ఆడ‌టం చూస్తుంటాం. ఇటీవల రంజీ ట్రోఫీ 2024 ఫైనల్ మ్యాచ్‌లో ఇలాంటిదే కనిపించింది. అక్కడ ధోనిని తన గురువుగా భావించిన ఓ స్టార్ బౌలర్ తన ప్రాణాంతక బౌలింగ్‌తో ప్రసిద్ధి చెందాడు. ఈ బౌలర్ విదర్భ జట్టుకు చెందినవాడు. అతని పేరు యశ్ ఠాకూర్.

రంజీ ట్రోఫీ 2024 ఫైనల్‌లో విదర్భ ముంబైతో తలపడుతోంది. విదర్భ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. 41 సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై తొలుత బ్యాటింగ్ చేసి తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకు ఆలౌటైంది. విదర్భ జట్టు తరపున రంజీ ట్రోఫీ ఫైనల్లో స్టార్ బౌలర్ యశ్ ఠాకూర్ ప్రాణాంతకంగా బౌలింగ్ చేసి ముంబై జట్టు బ్యాండ్ వాయించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసిన యష్.. ఈ వార్త రాసేంత వరకు రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ తీసుకున్నాడు.

విదర్భ జట్టు ఫాస్ట్ బౌలర్ యశ్ ఠాకూర్ ఈ మ్యాచ్‌లో ఇప్పటి వరకు మొత్తం 4 వికెట్లు పడగొట్టాడు. అతను తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు భూపెన్ లాల్వానీ, తుష్ కోటియన్, షామ్స్ ములానీలను అవుట్ చేశాడు. దీని తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో పృథ్వీ షాను తన వలలో బంధించాడు. రెండో ఇన్నింగ్స్‌లో 7వ ఓవర్ రెండో బంతికి పృథ్వీని యశ్ బౌల్డ్ చేశాడు. ఈ బంతి చాలా అద్భుతంగా డెలివ‌రీ చేయ‌గా.. అతను బౌల్డ్ అయ్యాడని షా స్వయంగా నమ్మలేకపోయాడు.

అయితే.. శిబిరానికి ఎంపికైన తర్వాత ఉమేష్ యాదవ్‌ను కలవ‌డం VCA అకాడమీలో తన మొదటి రోజు అని యష్ ది స్పోర్ట్స్‌స్టార్‌తో చెప్పాడు. నేను అతనిని బాగా ఆకట్టుకున్నాను. అతని అడుగుజాడలను అనుసరించి భారత్ కోసం ఆడాలనుకుంటున్నాను. అయితే అతనిలా బౌలింగ్ చేయ‌డంతో పాటు.. అతనితో ఒక్కసారి బౌలింగ్ చేయాలనేది మొదటి పెద్ద కల అని యష్ చెప్పాడు.

ఇది కాకుండా యష్ తన కోచ్ హింగ్నికర్‌తో జ‌రిగిన త‌న‌ సంభాషణను చెప్పాడు. ఒకసారి యష్ నెట్స్‌లో బౌలింగ్ చేస్తున్నప్పుడు అతని కోచ్ అతనిని చూసి వికెట్ కీపింగ్ గ్లౌజులు ధరించవద్దని చెప్పాడు. వెంటనే కోచ్‌కి సమాధానమిస్తూ.. తాను ఎంఎస్ ధోనీలా ఉండాలనుకుంటున్నానని చెప్పాడు. వికెట్ కీపింగ్ కాకుండా ధోనిని అనుకరించడానికి చాలా మార్గాలు ఉన్నాయని సర్ నాకు చెప్పారు. ఆటలోని ఇతర అంశాల్లో ధోనీ నుంచి నేర్చుకోవాలని.. బౌలింగ్‌లో దాన్ని వర్తింపజేయాలని కోచ్‌ నన్ను కోరాడు. అది నాకు టర్నింగ్ పాయింట్ అని య‌ష్ చెప్పుకొచ్చాడు.

Next Story