ఆఖరి బాల్.. సిక్స్‌ కొట్టి ముంబైని గెలిపించిన సజన, ఎవరీమె..?

ఉమెన్ ప్రీమియర్‌ లీగ్‌-2024 సీజన్‌ ప్రారంభం అయ్యింది.

By Srikanth Gundamalla
Published on : 24 Feb 2024 11:13 AM IST

wpl-2024, cricket, mumbai indians,   sajana,

ఆఖరి బాల్.. సిక్స్‌ కొట్టి ముంబైని గెలిపించిన సజన, ఎవరీమె..?

ఉమెన్ ప్రీమియర్‌ లీగ్‌-2024 సీజన్‌ ప్రారంభం అయ్యింది. తొలి మ్యాచే ఉత్కంఠభరితంగా సాగింది. అసలైన టీ20 క్రికెట్‌ మజా వీక్షకులకు అందింది. చివరి బంతి వరకు గెలుపు ఎవరిని వరిస్తుందో తెలియలేదు. ఉమెన్‌ ప్రీమియర్ లీగ్‌ -2024 తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌, ముంబై ఇండియన్స్‌ జట్లు తలబడ్డాయి. ఈ మ్యాచ్‌లో 3 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ విజయాన్ని అందుకుంది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌లా సాగిన ఈ మ్యాచ్‌లో చివరి బంతిని సిక్స్‌గా మలిచి హీరోగా నిలబడింది సజీవన్‌ సజన.

ఢిల్లీ, ముంబై మధ్య తొలి మ్యాచ్‌ బెంగళూరు చినస్వామి స్టేడియంలో జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 171 పరుగులు చేసింది. 172 పరుగుల లక్ష్యంతో ముంబై బ్యాటింగ్‌కు దిగింది. 19 ఓవర్లు ముగిసే సరికి ముంబై 4 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. దాంతో.. ఆఖరి ఓవర్‌లో ముంబై 12 పరుగులు చేయాల్సి ఉంది. చివరి ఓవర్‌ను ఆఫ్‌ స్పిన్నర్‌ క్యాప్సీకి అప్పగించారు. తొలి బంతితోనే పూజావస్త్రాకర్‌ను పెవిలియన్‌కు పంపింది. దాంతో.. 5 బంతుల్లో 12 పరుగులు చేయాల్సి ఉండగా.. రెండో బంతికి రెండు పరుగులు వచ్చాయి. మూడో బంతిని అమన్‌జోత్‌ కౌర్‌ సింగిల్‌ తీసి హార్మన్ ప్రీత్‌ కౌర్‌కు స్ట్రైక్ ఇచ్చింది. నాలుగో బంతిని హర్మన్ ఫోర్‌ కొట్టగా.. 5 పరుగులకు టార్గెట్‌ను తగ్గించింది. అనూహ్యంగా ఐదో బంతికి కౌర్ ఔట్ అయ్యింది. చివరి బంతికి ఐదు పరగులు కొట్టాల్సి ఉండగా.. క్రీజులోకి వచ్చింది సజీవన్‌ సజన. ఆఖరి బంతిని సిక్స్‌గా కొట్టి ముంబై ఇండియన్స్‌కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించింది. దాంతో.. ఎవరీ సజనా అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

సజీవన్‌ సజన కేరళలోని వయనాడ్‌కు చెందిన అమ్మాయి. మనంతవాడి అనే గ్రామంలో జన్మించింది. చిన్నతనం నుంచే క్రికెట్‌పై ప్రేమ పెంచుకుంది. ఎలాగైనా క్రికెట్‌లో రాణించాలని కలలు కన్నది. దానికి అనుగుణంగానే కష్టపడింది. సజన తండ్రి ఒక రిక్షా డ్రైవర్. సజన ఈ స్థాయి వచ్చేందుకు తండ్రి ఎంతో కష్టపడ్డాడు. కూతురు ఎదుగుదలలో కీలక పాత్ర పోషించాడు. ఒక వైపు కష్టం చేస్తూనే.. కూతురిని క్రికెట్‌ వైపు అడుగులు వేయించాడు. సజనా దేశవాళీ క్రికెట్ లో కేరళ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోంది. సౌత్ జోన్, ఇండియా-ఏ జట్ల తరపున కూడా ఆమె ఆడింది. డబ్ల్యూపీఎల్‌లో తొలిసారి వేలంలో పాల్గొనగా ఆమెను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించలేదు. కానీ WPL-2024 వేలంలో ముంబై ఇండియన్స్‌ ఆమెకు అవకాశాన్ని ఇచ్చింది. రూ.10లక్షల బేస్‌ ప్రైస్‌ ఉండగా.. సజనను రూ.15 లక్షలకు ముంబై కొనుగోలు చేసింది. ఈ క్రమంలో తొలి మ్యాచ్‌లోనే ముంబై ఇండియన్స్‌కు ఆమె మరిచిపోలేని విజయాన్ని అందించింది.


Next Story