World Cup: 9 మందితో బౌలింగ్, రోహిత్‌సేన రికార్డులివే..

వన్డే వరల్డ్‌ కప్‌-2023 టోర్నీలో టీమిండియా విజయ పరంపర కొనసాగుతూనే ఉంది.

By Srikanth Gundamalla  Published on  13 Nov 2023 12:23 PM IST
world cup-2023, team india, records,

World Cup: 9 మందితో బౌలింగ్, రోహిత్‌సేన రికార్డులివే..

వన్డే వరల్డ్‌ కప్‌-2023 టోర్నీలో టీమిండియా విజయ పరంపర కొనసాగుతూనే ఉంది. లీగ్‌ మ్యాచుల్లో భారత్‌ ఆడిన మొత్తం 9 మ్యాచుల్లో ఘన విజయాలను అందుకుంది. తద్వారా లీగ్‌ మ్యాచుల్లో ఇప్పటి వరకు ఒక్క ఓటమిని కూడా చూడని జట్టుగా నిలిచింది. ఆదివారం బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై 160 పరుగుల తేడాతో గెలిచింది భారత్. మొదట బ్యాటింగ్‌ చేసి ఆకాశమే హద్దుగా చెలరేగింది. దీపావళి సందర్భంగా టీమిండియా ఫ్యాన్స్‌కు ఆనందాన్ని అందించింది. అంతేకాదు.. ఆ తర్వాత ఫీల్డింగ్‌లోనూ ఎప్పుడూ లేని విధంగా టీమిండియా వ్యవహరించింది. ఈ మ్యాచ్‌ నామమాత్రం కావడంతో.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ప్రయోగాలను చేశాడు. బ్యాటర్లతోనూ బౌలింగ్ వేయించాడు. దాంతో.. అభిమానులకు ఇది కొత్త రకం అనుభూతిని ఇచ్చింది.

నెదర్లాండ్‌ 411 పరుగుల భారీ లక్ష్యాన్ని చేదించాల్సి ఉంది. దాంతో.. బౌలింగ్‌లో రోహిత్‌ ప్రయోగాలకు దిగాడు. మొత్తం 9మందితో బౌలింగ్ చేయించాడు. విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్‌ యాదవ్‌లతో మధ్యలో బౌలింగ్ చేయించాడు. అంతేకాదు.. చివరలో రోహిత్‌ శర్మ కూడా బౌలింగ్ చేశాడు. ఇక విరాట్‌ కోహ్లీకి, రోహిత్‌ శర్మకు చెరో వికెట్ పడింది. కోహ్లీకి వికెట్‌ పడినప్పుడు స్టేడియంలో అరుపులు కేకలతో ఎంతో ఉత్సాహపరిచారు అభిమానులు. ఇలా 9 మంది బౌలర్లను వినియోగించి వరల్డ్‌ కప్‌లో రోహిత్‌ సేన మరో రికార్డును ఖాతాలో వేసుకుంది. అత్యధికంగా 9 మంది బౌలర్లను వినియోగించడం 31 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. న్యూజిలాండ్ 1992లో ఇలా 9 మంది బౌలర్లను వినియోగించింది. అంతకుముందు ఇంగ్లండ్ కూడా 1987 వరల్డ్‌ కప్‌లో 9 మందితో బౌలింగ్ చేయించింది.

నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రికార్డులు:

* ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో భారత్‌ సాధించిన అత్యధిక వన్డే విజయాలు : 24 (2023), 24 (1998), 22 (2013)

* వరుసగా అత్యధిక విజయాలు సాధించిన జట్లలో ఆస్ట్రేలియా తర్వాత భారత్‌కు మూడో స్థానం. 2003, 2007లో వరుసగా 11 విజయాలు సాధించి తొలి రెండు స్థానాల్లో నిలిచిన ఆస్ట్రేలియా. 2023 వరల్డ్‌ కప్‌లో ఇప్పటి వరకు 9 విజయాలతో ఉన్న భారత్.

* వన్డే వరల్డ్‌ కప్‌-2023 టోర్నీలో టీమిండియా ఆల్‌రౌండర్ జడేజా ఇప్పటి వరకు మొత్తం 16 వికెట్లు తీశాడు. ఒక వరల్డ్‌ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత స్పిన్నర్‌గా అనిల్‌ కుంబ్లే(15) రికార్డును అధిగమించాడు.

* ఒకే క్యాలెండర్ ఇయర్‌లో వన్డేల్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన జట్టుగా (215 సిక్సులు) నిలిచింది.

* వన్డే వరల్డ్‌ కప్‌లో టీమిండియా తరఫున వేగవంతంగా సెంచరీ చేసిన కేఎల్ రాహుల్ రికార్డు (62 బంతుల్లో సెంచరీ)

Next Story