భారత్‌- పాక్‌ మ్యాచ్‌ కోసం స్పెషల్‌ ట్రైన్స్‌

భారత్‌- పాకిస్థాన్‌ మ్యాచ్‌ అంటే వచ్చే కిక్కే వేరు. ఈ పోరును చూడటం కోసం అభిమానులు స్టేడియాలకు పోటెత్తుతారు.

By అంజి  Published on  12 Oct 2023 8:45 AM IST
World Cup 2023, Railway department, special trains, India-Pak match

భారత్‌- పాక్‌ మ్యాచ్‌ కోసం స్పెషల్‌ ట్రైన్స్‌

భారత్‌ - పాకిస్తాన్‌ మ్యాచ్‌ అంటే రెండు దేశాలలోనే కాదు, క్రికెట్ ఆడే దేశాలలో సైతం ఆసక్తే. ఆ రోజు భారత్, పాకిస్తాన్‌లలో కోట్లమంది మంది ప్రేక్షకులు టీవీకే అతుక్కుపోతారు. ఇక అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ భారత్‌ - పాక్‌ మ్యాచ్‌ పోరును చూసేందుకు స్టేడియంకు పోటెత్తుతారు. వరల్డ్‌కప్‌లో భాగంగా శనివారం నాడు అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఈ మ్యాచ్‌ కోసం ముంబై నుంచి అహ్మదాబాద్‌కు ఓ వందే భారత్‌ సహా రెండు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ కోసం వెస్ట్‌ రైల్వే రెండు నగరాల మధ్య రైళ్లను నడపడం ఇదే మొదటిసారి కానుంది.

ఏసీతో కూడిన రైలు శుక్రవారం రాత్రి 9.30 గంటలకు ముంబై నుంచి బయల్దేరి తెల్లవారుజాము 5.30 గంటలకు అహ్మదాబాద్‌ చేరుకుంటుంది. అలాగే మ్యాచ్‌ తర్వాతి రోజు ఉదయం 4 గంటలకు అహ్మదాబాద్‌ నుంచి బయల్దేరే రైలు మధ్యాహ్నం ముంబైకి చేరుకుంటుంది. మరోవైపు ఈ మ్యాచ్‌ కోసం బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఈ సారి ఎలాంటి ఆరంభ వేడుకలు లేకుండానే వరల్డ్‌ కప్‌ ప్రారంభమైంది. కానీ భారత్‌ - పాక్‌ మ్యాచ్‌కు ముందు నరేంద్రమోదీ స్టేడియంలో స్పెషల్‌ ఈవెంట్‌ని బీసీసీఐ నిర్వహించనుందని సమాచారం. ఈ ఈవెంట్‌కు పలువురు క్రికెట్‌, సినిమా, రాజకీయ రంగాలకు చెందిన వారు పాల్గొంటారు. ఈ ఈవెంట్‌లో బాలీవుడ్‌ సింగర్‌ అర్జిత్‌ సింగ్‌ ప్రదర్శన ఉండబోతుంది.

ఈ మ్యాచ్‌ కోసం పాకిస్తాన్‌ జట్టు బుధవారం నాడు అహ్మదాబాద్‌ చేరుకుంది. 15 రోజుల పాటు హైదరాబాద్‌లో గడిపిన పాక్‌ జట్టు.. వార్మప్‌తో పాటు ప్రపంచకప్‌లో రెండు మ్యాచ్‌లు ఆడింది. ఉప్పల్‌లో వరుసగా నెదర్లాండ్స్‌, శ్రీలంకపై విజయాలు సాధించింది. మరోవైపు డెంగీ జ్వరం బారిన పడిన టీమిండియా క్రికెటర్‌ శుభ్‌మన్‌ గిల్‌ కోలుకుంటున్నాడు. గిల్‌ బుధవారం అహ్మదాబాద్‌ చేరుకున్నాడు. శనివారం పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో గిల్‌ ఆడతాడా? లేదా? అన్నది అనుమానంగానే ఉంది. ''గిల్‌ గురువారం సాధన చేస్తాడో లేదో తెలియదు. అతడు బాగా కోలుకున్నాడు. కానీ పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఆడతాడో లేదో చెప్పలేను'' అని ఓ బీసీసీఐ అధికారి అన్నాడు.

Next Story