మహిళల వన్డే ప్రపంచకప్.. పాక్‌పై భారత్ ఘన విజయం
Women's World Cup 2022 India Beat Pakistan By 107 Runs.న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్
By తోట వంశీ కుమార్ Published on 6 March 2022 8:49 AM GMTన్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్ 2022లో మిథాలీ సేన శుభారంభం చేసింది. ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 107 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని సాధించింది టీమ్ఇండియా. ఈ విజయంతో భారత్ వన్డేల్లో పాకిస్థాన్‌పై విజయాల సంఖ్యను 11కు పెంచుకుంది. ఈ మ్యాచ్‌తో కలిపి ఇప్పటి వరకు భారత్ దాయాది పాకిస్థాన్‌తో 11 మ్యాచుల్లో తలపడగా.. అన్ని మ్యాచుల్లో భారత జట్టునే విజయం వరించింది. ఈ 11 మ్యాచుల్లో కూడా కెప్టెన్ మిథాలీ రాజ్ ఆడడం విశేషం.
టాస్ గెలిచిన టీమ్ఇండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ స్మృతి మంధాన(75 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 52) లోయర్ ఆర్డర్ బ్యాటర్స్ పూజా వస్త్రాకర్(48 బంతుల్లో 4 ఫోర్లతో 53 నాటౌట్), స్నేహ్ రానా(59 బంతుల్లో 8 ఫోర్లతో 67) అర్థశతకాలతో సత్తాచాటడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 244 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో దీప్తి శర్మ(40) రాణించగా.. కెప్టెన్ మిథాలీ రాజ్(9), హర్మన్ ప్రీత్ కౌర్(5), షెఫాలీ వర్మ(0) ఘోరంగా విఫలం అయ్యారు. పాకిస్థాన్ బౌలర్లలో నిదాదర్, నష్రా సంధు రెండేసి వికెట్లు పడగొట్టగా..డయానా బైగ్, అనమ్ అమిన్, ఫాతిమా సనా తలో వికెట్ తీశారు.
అనంతరం 245 పరుగల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 43 ఓవర్లలో 137 పరుగులకే కుప్పకూలింది. పాకిస్థాన్ బ్యాటర్లలో ఓపెనర్ సిద్రా అమీన్(64 బంతుల్లో 3 ఫోర్లతో 30), డియన బైగ్(35 బంతుల్లో 2 ఫోర్లతో 24) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో రాజేశ్వరీ గైక్వడ్ నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. జూలన్ గోస్వామి, స్నేహ్ రాణా రెండేసి వికెట్లు పడగొట్టారు. మేఘన సింగ్, దీప్తి శర్మకు తలో వికెట్ దక్కింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఏ దశలోనూ పాకిస్థాన్ లక్ష్యం దిశగా సాగలేదు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన పూజా వస్త్రాకర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.