ఏకైక టెస్టులో ఇంగ్లాండ్‌పై భారత్‌ ఘన విజయం, ఆ రికార్డు బ్రేక్

సొంత గడ్డపై ఇంగ్లాండ్‌తో మహిళల భారత క్రికెట్‌ జట్టు ఏకైక టెస్టు మ్యాచ్‌ ఆడింది.

By Srikanth Gundamalla  Published on  16 Dec 2023 7:21 AM GMT
womens cricket, india, england, test match,

ఏకైక టెస్టులో ఇంగ్లాండ్‌పై భారత్‌ ఘన విజయం, ఆ రికార్డు బ్రేక్

సొంత గడ్డపై ఇంగ్లాండ్‌తో భారత మహిళల క్రికెట్‌ జట్టు ఏకైక టెస్టు మ్యాచ్‌ ఆడింది. ఈ సిరీస్‌లో టీమిండియా అదరగొట్టింది. ఆల్‌రౌండ్‌ షోతో రాణించిన భారత్‌ 347 పరుగుల తేడాతో గెలిచి రికార్డును క్రియేట్‌ చేసింది. ఇప్పటి వరకు శ్రీలంక పేరుమీద ఉన్న రికార్డు వెనక్కి వెళ్లిపోయింది. 1998లో శ్రీలంక 309 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ జట్టును ఓడించింది. ఇప్పుడు భారత మహిళల క్రికెట్‌ జట్టు ఆ రికార్డును బ్రేక్‌ చేసింది.

ఈ ఏకైక టెస్టు మ్యాచ్‌ భారత్‌లోని ముంబై వేదికగా జరిగింది. ఇందులో 347 పరుగుల తేడాతో భారత మహిళల జట్టు గెలిచింది. 479 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ జట్టు.. భారత బౌలర్ల దాటికి కేవలం 131 పరుగులకే ఆలౌట్ అయ్యింది. టీమిండియా స్పిన్నర్లు దీప్తి వర్మ, రాజేశ్వరి గైక్వాడ్‌ తమ మేజిక్‌ను చూపించారు. మూడోరోజు తొలి సెషన్‌లోనే ఇంగ్లాండ్‌ చాప చుట్టేయడంతో భారత్‌ రికార్డును బ్రేక్ చేసింది. కాగా.. దీప్తి శర్మ 4 వికెట్లు తీసింది. పుజా వస్త్రాకర్ మూడు వికెట్లు తీయగా.. గైక్వాడ్‌ రెండు వికెట్లు సాధించారు. ఇంగ్లండ్‌ బ్యాటర్లలో కెప్టెన్ హీథర్ నైట్ (21) పరుగులు తప్ప పెద్దగా ఎవరూ రాణించలేదు. ఇక అంతకుముందు భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ను 186/6 వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం లభించడంతో డిక్లేర్‌ చేసింది భారత్. రెండు ఇన్నింగ్సుల్లో కలుపుకొని ఇంగ్లాండ్‌ ముందు 479 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఈ భారీ స్కోర్‌ను చేదించలేక ఇంగ్లాండ్‌ 131 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

రెండో ఇన్నింగ్స్‌లోనే కాదు.. తొలి ఇన్నింగ్స్‌లో కూడా ఇంగ్లాండ్ టీమ్‌ రాణించలేకపోయింది. మొదటి ఇన్నింగ్స్‌లో కూడా 136 పరుగులకే ఇంగ్లాండ్‌ ఆలౌట్ అయ్యింది. భారత్‌ మాత్రం తొలి ఇన్నింగ్స్‌లో 428 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో న‌లుగురు భార‌త బ్యాట‌ర్లు హాఫ్ సెంచ‌రీల‌తో చెల‌రేగారు. సుభా స‌తీశ్‌(69), జెమీమా రోడ్రిగ్స్‌(68), య‌స్తికా భాటియా(66), దీప్తి శ‌ర్మ‌(67) హాఫ్ సెంచ‌రీల‌తో క‌దం తొక్క‌డంతో తొలి ఇన్నింగ్స్‌లో కొండంత స్కోర్ చేసింది.

Next Story